ఏపీ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది.ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు గెలిస్తే అధికారంలోకి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట.
అందుకే రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తగా ఈ జిల్లాలో రాజకీయాలను చక్కబెడుతుంటాయి.అయితే ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైసీపీకి పెద్ద కష్టం వచ్చి పడింది.
ఒకవైపు రఘురామకృష్ణంరాజు..మరోవైపు కొత్తపల్లి సుబ్బారాయుడు అధికార పార్టీని చెడుగుడు ఆడుకుంటున్నారు.
ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు సామాజిక వర్గాలు రాజకీయాలను శాసిస్తున్నాయి.
అందులో ఒకటి కాపు వర్గం అయితే మరొకటి రాజుల వర్గం.ఈ రెండు సామాజికవర్గాలను దగ్గర తీసుకునే ఏ రాజకీయ పార్టీ అయినా తన రాజకీయాన్ని విజయవంతంగా చేసుకుంటూ పోతుంది.
అయితే గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి గెలిచిన రఘురామకృష్ణంరాజుతో వైసీపీ హైకమాండ్‌కు విభేదాలు వచ్చాయి.దాంతో తొలి ఆరు నెలలలోనే ఆయన అధికార పార్టీకి రెబల్ ఎంపీ అయ్యారు.
దీంతో ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని వైసీపీ అధిష్టానం లోక్‌సభ స్పీకర్‌కు లేఖలు రాసినా స్పందన అయితే లేదు.
ఇదిలా ఉండగా ఇప్పుడు నర్సాపురం మాజీ ఎంపీ కొత్తపల్లి సుబ్బారాయుడు అధికార పార్టీకి మరో ట్విస్ట్ ఇచ్చారు.
ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుపై ఆరోపణలు చేయడంతో పాటు చ్చే ఎన్నికల్లో తాను నర్సాపురం నుంచే పోటీ చేస్తానని.కానీ ఏ పార్టీ నుంచి చేస్తానో ఇప్పుడే చెప్పలేనని కొత్తపల్లి సుబ్బారాయుడు వ్యాఖ్యానించారు.
తనకు పార్టీలకు అతీతంగా వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉందని ప్రగల్భాలు పలికారు.దీంతో వైసీపీ అధిష్టానం స్పందించి ఆయనపై వేటు వేసింది.
అయితే వైసీపీ హైకమాండ్‌ను ఏమీ అనలేదని తాను పార్టీ క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించలేదని.తనపై ఎందుకు చర్యలు తీసుకున్నారో చెప్పాలని కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడుతున్నారు.
మొత్తానికి నర్సాపురం రాజకీయాలు వైసీపీని ఇరకాటంలో పెట్టాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు.రాజు గారి మీద కోపం రాయుడి గారి మీద వైసీపీ చూపిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.నర్సాపురంలో ప్రధాన సామాజికవర్గాల నేతలను కెలికి వాసన చూడటంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ అధికార పార్టీ వైసీపీకి ఇబ్బందులు తప్పవని స్పష్టం చేస్తున్నారు.