మనం ఎంతగానో అభిమానించే వ్యక్తులు మన నుంచి దూరమై తిరిగిరాని లోకంలోకి వెళ్ళినప్పుడు కలిగే బాధ అంతా ఇంతా కాదు.ప్రతిరోజు మన కళ్ళ ముందే తిరుగుతూ మనల్ని ఆప్యాయంగా పిలిచే ఆత్మీయులు మన కంటికి కనిపించకుండా వెళ్ళిపోతే వచ్చే బాధను మాటల్లో చెప్పలేము.
అది మనిషి అయినా, లేదంటే మనం ప్రేమగా పెంచుకునే జంతువు అయినా సరే మనల్ని వదిలి వెళ్ళిపోతే ఆ జ్ఞాపకాల నుండి బయటపడడం చాలా కష్టం.ఈ క్రమంలోనే ఒక పిచ్చుకపై కర్ణాటకలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఎంతగానో ఆప్యాయతను పెంచుకున్నారు.
అయితే ఆ పిచుక చనిపోవడంతో గ్రామస్థులు అంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆ పిచ్చుకకు సమాధి కట్టి మరి దశదిన కర్మ ఘనంగా జరిపారు.
అసలు వివరాల్లోకి వెళితే.కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ జిల్లా శిడ్లఘట్ట తాలూకా బసవ పట్టణంలో చాలా పిచ్చుకలు తిరుగుతూ ఉండేవి.
అయితే ఆ గ్రామస్థులకు ఆ పిచ్చుకల్లో ఒక పిచ్చుక ఎంతో ప్రత్యేకమైనదిగా కనిపించింది.ఎందుకంటే ఆ పిచ్చుక ప్రతి రోజూ క్రమం తప్పకుండా అందరి ఇళ్లకు వస్తూ ఉండేది.
అలాగే వారు వేసిన గింజలను కూడా ఎంచక్కా వచ్చి తిని వెళ్లేది.దీంతో వారు ఆ పిచ్చుకపై ఎంతగానో మమకారం పెంచుకున్నారు.
ఈ క్రమంలోనే జనవరి 26న ఆ పిచ్చుక అనుకోకుండా చనిపోయింది.
ఆ పిచ్చుక మరణాన్ని ఆ గ్రామస్థులు తట్టుకోలేకపోయారు.ప్రతిరోజు వచ్చి తమను పలకరించి వెళ్లే పిచ్చుక ఇకపై లేదని తెలిసి కన్నీరు మున్నీరు అయ్యారు.ఆ పిచ్చుక జ్ఞాపకార్ధం ఏదన్నా చేయాలని ఆ గ్రామస్థులు అందరు భావించి ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఆ పిచ్చుకకు అందరూ ఒక చోట చేరి శాస్త్రోక్తంగా దానికి మనుషుల వలె అంత్యక్రియలు నిర్వహించారు.అక్కడితో ఆగకుండా ఆ పిచ్చుకకు సమాధి కట్టి దశదిన కర్మ కూడా జరిపించారు.
ఆ పిచ్చుక సమాధిపై దాని బొమ్మ వేసి శ్రద్ధాంజలి అని కూడా రాయించారు.అలాగే ఓ పిచ్చుక మళ్ళీ తిరిగి రా.అంటూ దానికి శ్రద్ధాంజలి పోస్టర్లు కూడా వేయించారు.అక్కడితో ఆగకుండా భారీగా వంటలు చేసి ఊరందరికీ భోజనాలు కూడా పెట్టారు.