అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ ఎన్జీవో సంస్థ భారత్‌లోని వికలాంగులకు బాసటగా నిలిచింది.ఈ మేరకు తన వార్షిక ఈవెంట్లో దాదాపు రూ.2 కోట్లను సేకరించింది.వాయిస్ ఆఫ్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ (వీఓఎస్ఏపీ) ఆధ్వర్యంలో జరిగిన ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ ఆదివారం ప్రారంభించారు.
వికలాంగులకు, వారి కుటుంబసభ్యులకు మార్కెట్లో వున్న సహాయక సామాగ్రి గురించి అవగాహన కల్పించడమే ఈ ఎగ్జిబిషన్ ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీనాక్షి లేఖీ మాట్లాడుతూ.వికలాంగులకు చేయూతను అందించడానికి సాంకేతికత మంచి మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ సదస్సుకు హాజరైన ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విక్రేతలు, స్వచ్ఛంద సంస్థలు ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారంతా వీఓఎస్ఏపీతో కలిసి పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు.
మరోవైపు వీఓఎస్ఏపీ వ్యవస్ధాపకుడు ప్రణవ్ దేశాయ్‌కి రాసిన లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయనను అభినందించారు.వర్చువల్ ఎగ్జిబిషన్ విజయవంతం కావాలని ప్రధాని ఆకాంక్షించారు.
వికలాంగుల కోసం సాంకేతికత ఆధారిత సహాయక పరిష్కారాలను చూపడానికి వీఓఎస్ఏపీ తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు.ఈ వర్చువల్ ఈవెంట్ ద్వారా 3,17,000 (భారత కరెన్సీలో 2.38 కోట్లు)ను సేకరించారు నిర్వాహకులు.
ఇకపోతే.లాస్ ఏంజిల్స్ కేంద్రంగా పనిచేస్తున్న ‘‘వాయిస్ ఆఫ్ స్పెషల్ ఎబిల్డ్ పీపుల్’’ (VOSAP) ’’ సంస్థ భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో లక్ష డాలర్ల విరాళాలను సమీకరించింది.వీటి సాయంతో భారత్‌లోని వికలాంగులకు కిరాణా సామగ్రి, పీపీఈ కిట్లు, ఇతరత్రా సాయం చేసింది.గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలోని పలు జిల్లాల్లో బీపీఏ అనే స్వచ్చంద సంస్థ సాయంతో తాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని… త్వరలో హైదరాబాద్, పూణేలకు సైతం విస్తరిస్తామని తెలిపారు.10,700 మంది రిజిస్టర్డ్ వాలంటీర్లున్న VOSAP సంస్థకు ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యొక్క స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ వుంది.
—