ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులు భారత్‌లో ఏమాత్రం సంకోచించకుండా పెట్టుబడులు పెట్టాలని విజ్ఙప్తి చేశారు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ .సోమవారం దుబాయ్‌లో జరిగిన ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ కాన్‌క్లేవ్‌లో పీయూష్ గోయెల్ పాల్గొని ప్రసంగించారు.
వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు తమ మాతృభూమిలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమన్నారు.భారత్‌లో అసాధారణ వృద్ధికి గొప్ప అవకాశం వుందని కేంద్ర మంత్రి తెలిపారు.
తాము పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇతరులు సైతం ఇన్వెస్ట్ చేసేలా ప్రవాసులు కృషి చేయాలని పీయూష్ గోయెల్ విజ్ఞప్తి చేశారు.
కోవిడ్ మహమ్మారి ఉద్ధృతి తీవ్రస్థాయిలో వున్నప్పటికీ మోడీ హయాంలో ఆర్ధిక సూచికలు పెరుగుతున్నాయని గోయెల్ గుర్తుచేశారు.2021 సెప్టెంబర్‌లో సరుకుల ఎగుమతులు 197.11 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని.ఇది సెప్టెంబర్ 2019 కంటే 23.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఆయన చెప్పారు.అదే సమయంలో జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్‌లో 5 నెలల గరిష్టానికి చేరుకున్నాయని పీయూష్ గోయెల్ వెల్లడించారు.అనువైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించడానికి తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.
రెడ్ టేపిజం నుంచి వ్యాపారాలకు రెడ్ కార్పేట్ వేయడం వరకు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నో సాధించారని పీయూష్ గోయెల్ పేర్కొన్నారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో ఇండియా కేవలం ఐదేళ్లలో 130 నుంచి 63కి చేరుకుందని ఆయన చెప్పారు.అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)లో గడిచిన ఆరేళ్లలో భారత్ 35 స్థానాలు ఎగబాకి 46వ స్థానానికి ఎగబాకిందన్నారు.
2020-21లో అత్యధికంగా 82 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ ప్రవాహాన్ని పొందిందన్నారు.కోవిడ్ మహమ్మారి వెలుగులోకి రాకముందు 2019-20 కంటే ఇది పదిశాతం పెరుగుదల అని కేంద్రమంత్రి అన్నారు.ప్రధాని మోడీ దూరదృష్టి గల నాయకత్వం దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఉన్నత స్థానానికి చేర్చిందని పీయూష్ గోయెల్ తెలిపారు.
‘‘వసుదైక కుటుంబం’’ అన్న ప్రాచీన సూక్తిని అనుసరించి ప్రపంచానికి సేవ చేస్తున్నామని మంత్రి చెప్పారు.కోవిడ్ క్లిష్ట పరిస్ధితుల్లో తాము పలు దేశాలకు మందులు, వ్యాక్సిన్‌లను సరఫరా చేశామని పీయూష్ గోయెల్ వెల్లడించారు.
వచ్చే ఏడాది భారత్- యూఏఈ దౌత్య సంబంధాలు 50వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నాయని.దీనిని తదుపరి స్థాయికి తీసుకెళ్తామని మంత్రి వెల్లడించారు.యూఏఈలో స్థిరపడ్డ 3.4 మిలియన్ల మంది ప్రవాస భారతీయులు రెండు దేశాల మధ్య వారధిగా పనిచేస్తారని గోయల్ అభిప్రాయపడ్డారు.