కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం శుక్లపక్షం ఐదవ రోజును వివాహ పంచమి అనే పండుగను జరుపుకుంటారు.అయితే ఈ సంవత్సరం వివాహ పంచమి డిసెంబర్ 19 శనివారం కావడంతో ఆ రోజు సీతారాముల దేవాలయంలో పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
ఈ మార్గశిర మాసం శుక్లపక్షం రోజున సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు సీతమ్మను వివాహమాడటం వల్ల ఈ వివాహ పంచమిని సీతారాముల కల్యాణ దినోత్సవంగా జరుపుకుంటారని మన పురాణాలు చెబుతున్నాయి.
జనకమహారాజు సీతాదేవికి స్వయంవరం ప్రకటించడంతో తన సోదరుడు లక్ష్మణుడు, తమ గురువు వశిష్ఠులతో కలిసి స్వయంవరానికి వెళ్లిన రాముడు స్వయంవరంలో శివధనస్సును విరిచి సీతమ్మ మెడలో పూలదండలు వేసి తన సొంతం చేసుకుంటాడు.
ఈ విషయాన్ని అయోధ్యలోని దశరధునికి తెలియడంతో తన నలుగురు భార్యలను తీసుకుని పెద్ద ఎత్తున మిథిలా నగరానికి చేరుకొని, మార్గశిర మాసం శుక్ల పక్ష పంచమి రోజు సీతారాములకు అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు.
సీతారాముల కళ్యాణం జరిగిన ఈ శుక్ల పంచమి రోజు పెళ్లికాని అవివాహితులు సీతారాములను ఆరాధించడం ద్వారా వారికి పెళ్లి గడియలు దగ్గర పడతాయని చెప్పవచ్చు.
అంతేకాకుండా ఆ శ్రీరామచంద్రుడికి పసుపు రంగు బట్టలను, సీతమ్మ తల్లికి ఎరుపు రంగు బట్టలను సమర్పించి పూజా చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి.ఈ శుక్ల పంచమి రోజున పూజ చేసే దంపతులకు అష్టైశ్వర్యాలు కలిగి పదికాలాలపాటు కలిసి ఉంటారని నమ్మకం.
అంతేకాకుండా ఏవైనా కారణాల చేత విడాకులు తీసుకొని విడిపోయిన భార్య భర్తలు ఇద్దరు ఈ శుక్ల పంచమి రోజున సీతారాములకు పూజ చేయడం వల్ల వారి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగి పోయి తిరిగి కలుసుకుంటారు.ఇంతటి పవిత్రమైన వివాహ పంచమి రోజు ఎంతో భక్తి భావంతో ఆ సీతారాములను పూజించడం వల్ల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.