షార్జా: దుబాయ్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సారధి కేఎల్ రాహుల్ ప్రదర్శిస్తున్న ఆటతీరుఫై విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా ప్రశంశల వర్షం కురిపించాడు.ప్రస్తుత క్రికెట్లో కేఎల్ రాహుల్ ఓ అద్భుతమైన ఆటగాడని అతను కితాబునిచ్చాడు.
గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విశేషంగా రాణిస్తున్న రాహుల్, ప్రపంచ క్రికెట్లో ఓ మాస్టర్ పీస్ ఆటగాడని అభిప్రాయపడ్డాడు.అలాగే భారత క్రికెట్లో ధోని వారసుడికి కావాల్సిన లక్షణాలన్నీ రాహుల్ లో ఉన్నాయని ఆతను పేర్కొన్నాడు.
రాహుల్ తనకు లభించిన శుభారంభాలను భారీ స్కోర్లుగా మలుచుకోవడంఫై కూడా దృష్టి సారించాలని సూచించాడు.అతను ప్రస్తుత ఫామ్ ను ఇలాగే కొనసాగించి సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో కూడా సత్తా చాటగలిగితే భారత జట్టులో తిరుగులేని శక్తిగా అవతరిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదని అభిప్రాయపడ్డాడు.
బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా ద్విపాత్రాభినయం పోషిస్తూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్ల విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపగలడని అతన్ని ఆకాశానికెత్తాడు.టీమిండియా రెగ్యులర్ వికెట్ కీపర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అన్న అంశంపై స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో లారా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.
అయితే రాహుల్ కు ప్రధాన పోటీదారులుగా భావిస్తున్న రిషబ్ పంత్, సంజు శాంసన్ లను కూడా ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అయన అన్నాడు.ప్రస్తుత ఐపీఎల్ లో వారు ప్రదర్శిస్తున్న ఆటతీరే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.
గతేడాది ఇదే అంశంపై జరిగిన చర్చలో పంత్ ను ధోని వారసుడిగా అతను ఏకిభించకపోవటం తెలిసిందే.