వైసీపీ అధ్యక్షుడు ఓ పొరపాటు చేసాడు.దాని కారణంగా ఇప్పుడు అనవసర నిందలు కూడా మోయాల్సి వస్తోంది.
లేకపోతే ఆ పార్టీ కి ఇంకా మైలేజ్ పెరిగి ఉండేది.ఇంతకీ జగన్ చేసిన తప్పు ఏంటో తెలుసా .? ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించకపోవడం.పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించేసిన జగన్ ఆ జిల్లాలోనే ఉన్న ప్రాజెక్ట్ ని సందర్శించకపోవడం నిజంగా జగన్ కి మైనెస్సే.
అనవసరంగా ఇప్పుడు అధికార పార్టీ చే మాటలు అనిపించుకోవాల్సి వస్తోంది.ఆ ప్రాజెక్ట్ లో చంద్రబాబు ప్రభుత్వం అవినీతి చేసిందని నిత్యం ఏదో ఒక సందర్భంలో జగన్ చెప్తూనే ఉంటాడు.
అలాంటప్పుడు ఒకసారి ఆ ప్రాజెక్ట్ సందర్శించి తన అనుమానాలు నిజమే అని చెప్పే అవకాశం జగన్ చేజార్చుకున్నాడు.
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు జగన్ వెళ్లి ఉంటే బాగుండేది.ఆ పార్టీ అభిమానులకు కూడా మంచి ఊపు వచ్చేది.ఎందుకంటే, ఆ ప్రాజెక్టులో తీవ్ర అవినీతి జరిగిపోయిందనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో జరిగిన పనులు ఏవీ లేవని జగన్ విమర్శిస్తుంటారు కదా.పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల్లో వందలకోట్లు కమిషన్లను చంద్రబాబు తీసుకున్నారని తరచూ ఆరోపిస్తుంటారు.అంతేకాదు, పోలవరంలో జరిగిన చాలా పనులు తన తండ్రి హయాంలోనే జరిగినవనీ చెప్పుకుంటూ ఉంటారు.
కనీసం తన తండ్రి హయాంలో జరిగిన పనులు ఇవీ అని చూపెట్టుకోవడానికైనా వెళ్తే బాగుండేది.పాదయాత్రలో భాగంగా పోలవరం సందర్శించి, అక్కడో సభ పెట్టి ఉంటే వైసీపీకి క్రెడిట్ వచ్చేది.
కానీ జగన్ మాత్రం అలా చేయలేదు.
పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతి బాగా పెరిగిపోయిందని, టీడీపీ నేతలు ప్రాజెక్ట్ పేరు చెప్పి కావాల్సినంత దోచేసుకుంటున్నారని, దానికి తగిన ఆధారాలున్నాయంటూ వైసీపీ నాయకులూ ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు .వాటిల్లో కొన్నిటిని అయినా బయటపెట్టి బాబు బాగోతం ప్రజలకు తెలియజేస్తే ఇంకా బాగుండేది కానీ అలా చేయలేదు.పోలవరం ప్రాజెక్టు సందర్శనకు కొంతకాలం క్రితం వైసీపీ నాయకులు ఓ బస్సులో వెళ్లారు.
అక్కడి పనులు సమీక్షించి.పనులేవీ జరగలేదంటూ విమర్శలు చేశారు.
వాస్తవానికి అక్కడ జరుగుతున్న పనుల గురించి ఇంజినీర్లు కొంతమంది వివరించినా.వాటిలోని సాంకేతికత వైకాపా నేతల్లో చాలామందికి అర్థంకాలేదన్న విమర్శలూ వచ్చాయి ! వాస్తవంగా మాట్లాడుకోవాలంటే… వైసీపీ నాయకులు చేసిన పోలవరం బస్సు యాత్ర వాళ్ళ ఆ పార్టీకి ఏమాత్రం కలిసిరాలేదు.
కనీసం, ఇప్పుడు పాదయాత్రలో ఉన్న జగన్ ఆ ప్రాజెక్ట్ ని సందర్శించి ఉంటే క్రెడిట్ తో పాటు అనవసర విమర్శలకు కూడా చెక్ పెట్టినట్టు ఉండేది.