రాజస్థాన్‌లోని జలోర్‌కు చెందిన 77 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి 55 సార్లు పదో తరగతి పరీక్షలు రాసి 56వ ప్రయత్నంలో ఉత్తీర్ణుడయ్యాడు.హుకుందాస్ వైష్ణవ్ అనే వృద్ధుడు ఇప్పుడు 12వ తరగతిలో చేరాడు.
వయసుకు చదువుతో సంబంధం లేదని నిరూపించాడు.ఈ వృద్ధుని కథ చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
జలోర్‌లోని సర్దార్‌ఘర్ గ్రామంలో 1945లో జన్మించిన ఈయన 1962లో మొకల్‌సర్‌లో తొలిసారి టెన్త్ పరీక్ష రాశారు.రెండుసార్లు వరుసగా ఫెయిల్ అయ్యాడు.
దీంతో అతని స్నేహితులు నువ్వు పదోతరగతి పరీక్షలో ఎప్పుడూ ఉత్తీర్ణత సాధించలేవని ఎగతాళి చేశారు.దీనిని సవాలుగా స్వీకరించిన హుకుందాస్ తాను ఏదో ఒక రోజు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులవుతానని వారితో ఛాలెంజ్ చేశాడు.
గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో నాలుగో తరగతి ఉద్యోగిగా చేరిన హుకుందాస్ వైష్ణవ్ ఆ తరువాత నుంచి ప్రైవేటుగా టెన్త్ రాయడం ప్రారంభించాడు.
2005లో హుకుందాస్ వైష్ణవ్ ట్రెజరీ డిపార్ట్మెంట్ నుండి క్లాస్ IV ఉద్యోగిగా పదవీ విరమణ చేశాడు.2010 నాటికి హుకుందాస్ వైష్ణవ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 48 సార్లు హాజరయ్యాడు.ఆ తర్వాత స్టేట్ ఓపెన్ బోర్డ్ నుంచి ఇవే పరీక్షలకు ప్రయత్నించి చివరకు 2019లో సెకండ్ డివిజన్లో ఉత్తీర్ణుడై 10వ తరగతి పాసయ్యాడు.
అనంతరం అతను 2021-22 సెషన్లో 12వ తరగతిలో చేరాడు త్వరలో పరీక్షలు రాయనున్నాడు.ఇందుకోసం ఇటీవలే జలోర్ నగరంలోని స్టేట్ ఓపెన్‌కు రిఫరెన్స్ సెంటర్ అయిన ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో 12వ తరగతి ఆర్ట్స్ క్లాస్ పరీక్ష కోసం హుకుందాస్ వైష్ణవ్ దరఖాస్తు సమర్పించాడు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతని మనవడు ఇప్పటికే తన పాఠశాల విద్యను పూర్తిచేశాడు.