మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారి లో ఎడారి బతుకులు బతికే వారు చాలామంది ఉంటారు.నిజమే కానీ మన ఊర్లో మన కళ్ళ ముందు మన పశువుల కాపర్లు పడే కష్టాలు తక్కువ కాదు అని అందరికీ తెలుసు.
ఉదయం సద్ది కట్టుకొని వెళ్లినవారు పగలంతా నోరులేని జీవులతో తిరిగి రాత్రికి గానీ ఇల్లు చేరుకుంటారు.ఒకప్పుడు మన దేశంలో సంపద అంటే పశువులు మాత్రమే ఉండేవి.
అలా పశువులను కాస్తూ మంద నుంచి తప్పిపోయిన ఒక గేదె ను వెతుకుతూ కొండపైకి వెళ్లిన ప్రస్తుత జగిత్యాల జిల్లా కోడిమ్యాలకు చెందిన సింగం సంజీవుడికి పొదల్లో హనుమంతుడి విగ్రహం కనిపించింది.ఆ తర్వాత రోజు భార్య ఆశమ్మతో కలిసి వచ్చి ఆ స్వయంభు స్వామిని వెలుగులోకి తెచ్చి దానికో చిన్న గుడి కట్టి అందరికన్నా ముందు కొండగట్టు ఆంజనేయుడికి మొక్కిన వారు ఆ గొల్ల దంపతులు.
ఇది దాదాపు నాలుగు వందల సంవత్సరాల నాటి కథ.ఆ తర్వాత కాలంలో కృష్ణారావు దేశ్ముఖ్ అనే దొరవారు ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడం వల్ల స్వామివారి దర్శనానికి వచ్చిపోయే భక్తుల సంఖ్య బాగా పెరిగిపోయింది.1968లో దాన్ని నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ వారు చేపట్టడం మొదలుపెట్టారు.జగిత్యాల జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ హైవే పైనున్న కొండగట్టు దేవస్థానం పూర్తి సంవత్సరం వచ్చిపోయే హనుమాన్ భక్తులతో ఎప్పుడు రద్దిగా ఉంటుంది.
ఆంజనేయస్వామి దీక్షల కాలంలో ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత భక్తులు వస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఇక్కడ సరైన రోడ్లు లేకనే చాలా బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి.ఇటీవల జగిత్యాల జిల్లా సందర్శనకు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దేవాలయ అభివృద్ధికి వంద కోట్లు ప్రకటించడం విశేషం.సంజీవుడు ఆశమ్మలు ఆంజనేయ స్వామికి చేసిన సేవలకు శాసన ఆధారం కూడా చూపుతున్నారు.
కాబట్టి ఆ గొల్ల దంపతుల విగ్రహాలు పౌరుషానికి మారుపేరైన కొండల రాయుడు విగ్రహము కూడా కొండగట్టుపై పెట్టడం జరిగింది








