తెలుగు సంప్రదాయం ప్రకారం ఎవరైనా పెద్దలు కనిపించినప్పుడు లేదా దైవ దర్శనానికి వెళ్లినప్పుడు రెండు చేతులు కలిపి నమస్కారం చేస్తుంటాం.అసలు నమస్కారం ఎందుకు చేయాలి.
దీని వల్ల కలిగే లాభాలేమిటో చూద్దాం.
నమస్కారం నమః అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది.
సాత్త్విక గుణానికి నమస్కారం ఒక చిహ్నం.గౌరవ సూచకంగా రెండు చేతులు జోడించి పెట్టే ఈ నమస్కారంలో ఆధ్యాత్మిక అంతరార్థం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
రెండు చేతులు జోడించడం వల్ల మనలోని అహంకారం పోయి అణుకువ బయటకు వస్తుందట.అంతేకాదండోయ్ నీలో, నాలో ఉన్న ఆత్మ ఒక్కటే అన్న సత్యాన్ని తెలుపుతుందట.
మనలో ద్వైదీ భావనలను తొలగించుకుంటూ మనసును సమ స్థితిలో ఉంచుకోవాలన్న అద్వైత బోధను నమస్కారం సూచిస్తుందని పెద్దలు చెబుతుంటారు.ఒకరికొకరు నమస్కారం చేసుకోవడం వల్ల ఒకరినొకరు తాకకపోయినప్పటికీ… ఒకరిలోని సానుకూల శక్తి మరొకరికి ప్రసారమవుతుందని చెబుతుంటారు.

మనం చేసే నమస్కారంలో చూపుడు వేలు జీవాత్మ, బొటన వేలు పరమాత్మకు ప్రతీకలంట.చిటికెన వేలిని తమస్సుకు, ఉంగరపు వేలిని రజస్సుకు, మధ్య వేలిని సత్త్వ గుణాలకు ప్రతీకలుగా చెబుతారు.వాటిని కలుపుతూ ఉంచే ఈ ప్రక్రియతో మనిషిలోని దివ్య చైతన్యం జాగృతమవుతుందట.అందుకే గొప్ప గొప్ప వారికి, పెద్దలకు, గురువులకు రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలని పెద్దలు చెబుతుంటారు.
ప్రతీ పాఠశాలలో పిల్లలందరికీ నమస్కారం చేయడం నేర్పిస్తుంటారు.కుటుంబ సభ్యులు కూడా దేవుడి ముందు పిల్లలను నిల్చోబెట్టి నమస్కారం చేయిస్తుంటారు.