కార్తీక మాసం చివరి రోజు అయిన అమావాస్య రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఈ అమావాస్య రోజున భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలను దర్శించడం అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈ అమావాస్య రోజున మన ఇంటిలో పూజ ముగించుకుని శివాలయాలను దర్శించుకుంటే సర్వపాపాలూ నశిస్తాయి.సోమవారం వచ్చే ఈ అమావాస్య సంవత్సరంలో కేవలం రెండుసార్లు మాత్రమే వస్తుంది.
కార్తీక మాసంలో వచ్చే సోమవారం అమావాస్యను సోమావతి అమావాస్య అని పిలుస్తారు.అంతేకాకుండా ఈ అమావాస్యను మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు.
ఈ సోమావతి అమావాస్య రోజున శివాలయాలలో పంచారామంలో, రాహుకాలంలో శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించడం ద్వారా ఆ శివుని అనుగ్రహం కలుగుతుంది.ఈ విధంగా శివుని దర్శించుకొని, శివాలయంలో ఉండే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
అంతేకాకుండా జాతకరీత్యా ఉన్న దోషాలు సైతం తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
ఈ సోమావతి అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రధానం చేయడం ద్వారా వారు సంతృప్తి చెంది మనకు మంచిని కలుగ చేస్తారని ప్రతీతి.అందుకోసమే ఈ రోజు పెద్దలకు పిండప్రదానాలు చేస్తారు.ఈ అమావాస్య రోజు వివాహం కాని వారు శివుని దర్శించి రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం ద్వారా వివాహ గడియలు దగ్గరపడతాయి.
పెళ్లైన స్త్రీలు ఉపవాస దీక్షలతో రావిచెట్టుకు శివుని ఆరాధిస్తూ పూజలు చేయటం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తం కలుగుతుంది.
జాతకరీత్యా కాలసర్పదోషాలతో ఎంతోమంది సతమతమవుతుంటారు.అలాంటి వారు ఈ సోమావతి అమావాస్య రోజున రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం ద్వారా కాలసర్ప దోషాలు సైతం తొలగిపోతాయి.అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.