అనూహ్య పరిణామాల మధ్య బ్రిటన్ ప్రధాన మంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.తొలుత బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆ తర్వాత పెని మౌర్డౌంట్‌లు పోటీ ఇస్తారని అంతా భావించారు.
కానీ వారిద్దరూ అనూహ్యంగా రేసులో నుంచి తప్పుకోవడంతో రిషికి మార్గం సుగమమైంది.దీంతో యూకే ప్రధానిగా ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా సునాక్ చరిత్ర సృష్టించారు.
బ్రిటన్ ఇప్పుడున్న పరిస్ధితుల్లో దేశాన్ని గాడిలో పెట్టగల సత్తా రిషికి మాత్రమే వుందని.కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు అభిప్రాయపడటంతోనే మెజారిటీ ఎంపీల మద్ధతు ఆయనకు లభించింది.
అంతా బాగానే వుంది కానీ.బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ ఇప్పుడేమో రిషి సునాక్.నెలల వ్యవధిలో ముగ్గురు ప్రధాన మంత్రుల ఎంపిక జరిగిన దరిమిలా అసలు బ్రిటన్‌లో ప్రధానిని ప్రజలు ఎన్నుకోరా.అసలు యూకేలో ఎన్నికల విధానం ఎలా వుంటుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో నెటిజన్లు ఈ వ్యవహారంపై జల్లెడ పడుతున్నారు.ఈ క్రమంలో బ్రిటన్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనిచేసే విధానం గురించి ఒకసారి చూస్తే:బ్రిటన్ను 650 నియోజకవర్గాలుగా విభజించారు.ఎన్నికల సమయంలో ఓటర్లు తమ స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా కావాలనుకునే ప్రతినిధి కోసం అభ్యర్ధుల జాబితాలో వారికి ఎదురుగా వున్న పెట్టెలో టిక్ చేస్తారు.అభ్యర్ధులు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కన్జర్వేటివ్‌లు, లేబర్ పార్టీ, లిబరల్ డెమొక్రాట్లు, గ్రీన్స్‌కు చెందిన వారై వుంటారు.
ఎన్నికల అనంతరం హౌస్ ఆఫ్ కామన్స్‌లో మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.ఆ పార్టీ నాయకుడు ప్రధాన మంత్రి అవుతారు.సంకీర్ణాలకు వీలున్న పరిస్ధితులే వున్నప్పటికీ.బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌లు, లేబర్లలో ఎవరో ఒకరి వైపే ఓటర్లు మొగ్గుచూపుతూ వస్తున్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ.తమ నిబంధనల ప్రకారం అవసరమనుకుంటే నాయకుడిని మార్చగలదు.జాతీయ స్థాయిలో ఎన్నికలు అవసరం లేకుండానే పాత వ్యక్తి స్థానంలో మరొకరు ప్రధాని కావొచ్చు.బ్రిటన్‌లో చివరిసారిగా 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.
రాజ్యాంగం ప్రకారం 2024 వరకు మరోసారి ఎన్నికలు జరిగే అవసరం లేదు.కానీ దేశ జనాభాలో కొద్దిశాతం మంది అభిప్రాయంతో మూడోసారి ప్రధానిని ఎన్నుకోవడమే యూకే వాసులను , ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది.
అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ప్రధాన మంత్రికి వుంటుంది. ఒపీనియన్ పోల్స్ ప్రకారం ప్రతిపక్ష లేబర్ పార్టీ కంటే కన్జర్వేటివ్ పార్టీ బాగా వెనుకబడి వున్నట్లు సర్వేలు చెబుతుండటంతో సునాక్ ముందస్తుకు వెళ్లే అవకాశం లేదు.అలాగే చట్టసభ సభ్యులు హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఒకవేళ ఈ ప్రక్రియలో విజయం సాధించినట్లయితే ఎన్నికలు జరగవచ్చు.అయితే అవిశ్వాస తీర్మానం సందర్భంగా చాలా మంది కన్జర్వేటివ్‌లు తమ సొంత పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వుంటుంది.