గరుడ పురాణం పేరుతో ఎన్నికల ముందు టీడీపీ కి మద్దతుగా, వైసీపీ, బీజేపీకి వ్యతిరేకంగా అనేక సంచలన ఆరోపణలు చేస్తూ మీడియాలో హల్చల్ చేసిన సినీ నటుడు శివాజీ ఎన్నికల అనంతరం ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.ఏపీలో వైసీపీ ప్రభుత్వం తన మీద రాజకీయ కక్ష తీర్చుకుంటుంది అనే ఉద్దేశంతో ఆయన సైలెంట్ అయిపోయారు.
అయితే ఆ తరువాత టీవీ9 వివాదంలో మరోసారి తెర మీదకు వచ్చాడు.అయినా పెద్దగా వార్తల్లోకి ఎక్కలేదు.
కానీ ప్రస్తుతం ఏపీలో మారిన పరిస్థితుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంస్థ మేఘ ఇంజనీరింగ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ మళ్లీ తెర మీదికి వచ్చాడు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
తాను అసలు ఈ వీడియోను మెయిన్ మీడియా ద్వారా ప్రజలకు చెప్పాల్సి ఉన్నా వాటిని ప్రసారం చేసే దమ్ము, ధైర్యం దేశంలోని ఏ మీడియాకు లేదని శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ మేఘ ఇంజనీరింగ్ కంపెనీతో లాలూచీపడి దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు.దేశానికి మేఘా ఇంజనీరింగ్ కంపెనీ చాలా ద్రోహం చేసిందని, ఆ కంపెనీ చేస్తున్న నిర్వాకం వల్ల రాబోయే తరాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.తాను ఈ అవినీతి అక్రమాలను ఇక్కడితో వదిలిపెట్టనని వారానికి ఒకసారి మెఘా ఇంజనీరింగ్ కంపెనీ అక్రమాల గురించి సాక్షాలతో సహా బయట పెడుతూ దానికి సంబంధించిన వీడియోలను కూడా బయటకు వదులుతానని ప్రకటించారు.
అసలు మేఘ ఇంజనీరింగ్ కంపెనీ గురించి చెప్పుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ కాంట్రాక్టు సంస్థ హవా నడుస్తుంది.ఇటీవల తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం మిషన్ భగీరథ భారీ ప్రాజెక్టులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టింది.
ఈ బడ్జెట్ సుమారు లక్షన్నర కోట్లకు పైగానే ఉంది.అలాగే తెలంగాణలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు కాంట్రాక్ట్ కూడా దక్కించుకుంది.
ఏపీలోనూ ఇదే సంస్థకు ఆ ప్రాజెక్టు దక్కే అవకాశం కనిపిస్తోంది.ఇక మెగా అధినేత కృష్ణారెడ్డి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరితోనూ సఖ్యత కొనసాగిస్తూ వస్తున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలవరం రివర్స్ టెండరింగ్ కి వెళ్లి ప్రభుత్వానికి సుమారు 800 కోట్లు ఆదా అయ్యేలా పనులు చేసేందుకు మెగా సంస్థ టెండర్ వేసి ఆ కాంట్రాక్టును దక్కించుకుంది.అయితే ఇదే సంస్థ ఆరు నెలల ముందు సుమారు 300 కోట్లు ఎక్కువ కావాలంటూ టెండర్ వేసింది.
కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ మొత్తాన్ని తగ్గించుకుని టెండర్ వేయడం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో మెగా సంస్థపై అనేక అనుమానాలు పెరిగిపోయాయి.

ఇక గరుడ పురాణం శివాజీ గురించి చెప్పుకుంటే ఇదే మేఘా కంపెనీపై ఆయనకు వ్యక్తిగతంగానూ ఆగ్రహం ఉంది.దీనికి కారణం టీవీ9 కొత్త యాజమాన్యంలో మెగా కృష్ణారెడ్డికి కూడా వాటా ఉంది .టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ మీద తనమీద పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మెగా కృష్ణారెడ్డి కూడా ఒక కారణం అని శివాజీ నమ్ముతున్నారు.ఈ నేపథ్యంలోనే మెగా సంస్థ కు సంబంధించి అవినీతి అక్రమాలను వారానికోసారి బయటపెడతానని శివాజీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.