దర్జాగా నాలా ఆక్రమణ

సూర్యాపేట జిల్లా:పేట మున్సిపల్ పరిధిలో నాలాల ఆక్రమణల పర్వం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది.

తాజాగా ఖమ్మం రోడ్ లోని బిపిసి పెట్రోల్ బంక్ పక్కన 343 సర్వే నెంబరులోని ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై గల నాలా బ్రిడ్జిలోనే కొందరు ఆక్రమణదారులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు.

జనవరి మాసంలో వచ్చిన అకాల వర్షాలకు సూర్యాపేట పట్టణ మొత్తం వరదలకు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.దీనికి కారణం ఎక్కడికక్కడ నాలా ఆక్రమణలు చేపట్టడమే కారణమని గుర్తించిన అధికారులు కొన్ని ఆక్రమణలు అప్పటికప్పుడు కూల్చివేశారు.

Occupy Me As A Class-దర్జాగా నాలా ఆక్రమణ-Surya

మరికొన్నింటిని కూల్చివేయాలని సాక్షాత్తు నియోజకవర్గ శాసనసభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.కానీ,టౌన్ ప్లానింగ్,మున్సిపల్ అధికారులు మంత్రి ఆదేశాలను పెడచెవిన పెట్టి,ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.

అధికారుల అలసత్వం కారణంగా తాజాగా నాలా బ్రిడ్జిలోనే ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి పక్కనే అక్రమ నిర్మాణాలు చేపట్టడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.ఈ అక్రమ కట్టడం వలన మురికి నీరు కిందకు వెళ్లే అవకాశం ఉండదు.

Advertisement

దానితో ఖమ్మం- సూర్యాపేట జాతీయ రహదారి బ్రిడ్జి నీటితో దిగ్బంధం అవ్వక తప్పదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వచ్చే ముంపును ముందే పసిగట్టకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పేట నాలా వ్యవస్థ తయారు కావడం ఖాయమని అంటున్నారు.

ఇదే విషయమై విలేకరులు సంబంధిత శాఖ అధికారికి ఫోన్ చేయగా బుధవారం రోజున నిర్మాణాలు చేపడుతున్న స్థలం వద్దకు వెళ్లి పనులను ఆపాలని ఎన్ఓసీ సర్టిఫికెట్ తీసుకొస్తే నిర్మాణాలు చేపట్టి కోవచ్చని,అప్పటిదాకా పనులు ఆపాల్సిందిగా చెప్పినట్లు ఆ శాఖ అధికారి తెలిపారు.అయినా గురువారం కూడా సంబంధిత స్థల యజమాని దర్జాగా నిర్మాణాలు చేపట్టడం విశేషం.

మళ్ళీ సంబంధిత అధికారిని ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నం చేయగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఏది ఏమైనా పేట మున్సిపల్ అధికారుల తీరుతో పట్టణ ప్రజలు రాబోయే వర్షా కాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదని అనుకుంటున్నారు.

తక్షణమే స్పందించిన కమిషనర్ ఈ ఆక్రమణల పర్వంపై సోషల్ మీడియాలో వచ్చిన కథనానికి మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించారు.అనుమతి లేని అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చి వేయాలని సిబ్బందిని ఆదేశించారు.

మున్సిపల్ కమిషనర్ రామనుజుల రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది సూర్యాపేట-ఖమ్మం రహదారి పక్కనే ఉన్న నడి నాలాలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని కూల్చివేశారు.అత్యంత వేగంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ తీరుపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

కమిషనర్ బదిలీ? ఇదిలా ఉంటే ఇంతలోనే పేట మున్సిపల్ కమిషనర్ రామనుజుల రెడ్డికి బదిలీ అయినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి.దీనికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసినట్లు ప్రచారం జరిగింది.

ఈ విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.

Latest Suryapet News