మహారాష్ట్ర రాజకీయాల్లో అనుకున్నట్లుగానే గొప్ప ట్విస్ట్ ఎదురైంది.నిన్నటివరకు శివసేన కే తమ మద్దతు అంటూ తెలుపుతూ వచ్చిన ఎన్సీపీ ఇప్పుడు ఉన్నట్టుండి యూటర్న్ తీసుకొని బీజేపీ కే తన మద్దతు ను ఇచ్చింది.
దీనితో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి.కాంగ్రెస్-ఎన్‌సీపీలతో చర్చలు జరిపి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే అని తెలిపిన శివ సేన కు ఎన్సీపీ పార్టీ గట్టి ఝలక్ ఇచ్చింది.
ప్రభుత్వ ఏర్పాటుకు అంతా సిద్ధం ఇక సీఎం గా ఉద్దవ్ థాక్రే పేరు కూడా ప్రకటించేసిన ఈ తరుణంలో మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.అనూహ్యంగా బీజేపీకి ఎన్‌సీపీ మద్దతు తెలపడం తో రెండోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయడం,డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేయడం చక చకా జరిగిపోయింది.
ఫడ్నవీస్, అజిత్ పవార్‌లతో మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ ప్రమాణస్వీకారం చేయించారు.దీంతో మహారాష్ట్ర పీఠాన్ని అధిరోహించాలన్న శివసేన ఆశలు అడియాశలయ్యాయి.
రైతుల సమస్యల పరిష్కారం కోసమే బీజేపీకి మద్దతు ఇచ్చామని ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ పేర్కొన్నారు.వాస్తవానికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య అవగాహన కుదిరడానికి ముందు ఎన్సీపీ శివసేన కు ఒక షరతు కూడా విధించింది.
ఎన్డీయే కూటమి నుంచి బయటకు వస్తేనే తమ మద్దతు శివసేనకు ఉంటుంది అని తెల్పడం తో శివసేన వెంటనే కూటమి నుంచి బయటకు కూడా వచ్చేసింది.అంతేకాకుండా కేంద్ర మంత్రిగా ఉన్న శివసేన పార్టీ నేత కూడా తన పదవికి రాజీనామా కూడా చేసేసి కూటమి తో తెగతెంపులు చేసేసుకుంది.
ఇంత గా అన్నీ వదులుకున్న శివసేన కు సీఎం పదవి మాత్రం దక్కకపోవడం విశేషం.
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా.బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి.బీజేపీ-శివసేన కలిసి ఎన్నికల్లో బరిలో దిగగా.
ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి.సీఎం పీఠాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకుందామని శివసేన ప్రతిపాదించగా.
దీనికి బీజేపీ విముఖత వ్యక్తం చేసింది.దీంతో శివసేన ఎన్‌డీఏ నుంచి వైదొలగి, కాంగ్రెస్-ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి సిద్ధమైంది.
ఈ సమయంలో బీజేపీకి మద్దతు ఇచ్చి ఎన్‌సీపీ ఊహించని ఝలక్ ఇచ్చింది.