నల్లగొండ జిల్లా:దేశంలో మోదీ అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
విపక్షాల గొంతులు నొక్కేందుకే బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తుందని ఆరోపించారు.
గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వామపక్ష పార్టీల సమన్వయ సమావేశానికి ఆయన హాజరయ్యారు.అనంతరం వామపక్షాలతో కలసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతకు భంగం కలిగే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీని నిలువరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతూ ప్రజల మధ్యన విచ్ఛిన్నానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.అంతటితో ఆగని మోదీ సర్కార్ తెలంగాణాతో సహా బీజేపీ యేతర రాష్ట్రాలలో అభివృద్ధి,సంక్షేమానికి అడ్డుపడుతుందని మండిపడ్డారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రజలు తెలంగాణాలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు కావాలంటూ వస్తున్న డిమాండ్ లే కేంద్రం తెలంగాణాపై కక్ష పూరితంగా వ్యవరించేందుకు కారణమన్నారు.అటువంటి బీజేపీని ఉపేక్షించుకుంటూ పోతే దేశం ప్రమాదం అంచుకు చేరే ప్రమాదం ఉందన్నారు.
బీజేపీని నిలువరించాల్సిన అవసరం ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల రూపంలో వచ్చిందన్నారు.ఆ శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు.
అందుకు తోడ్పాటునందించే ప్రగతిశీల శక్తులను కలుపుకొని పోవాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు.అందుకు మునుగోడు ఉప ఎన్నికలనే వేదికగా ఎంచుకొని వామపక్షాలతో కలసి బీజేపీపై పోరాటానికి శ్రీకారం చుట్టామన్నారు.
దేశంలో కాంగ్రెస్ బలహీనపడిందని,బీజేపీ బలంగా వ్యతిరేకించే శక్తులను కలుపుకోవడంలో భాగంగా వామపక్షాలతో కలసి పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు.అందుకు అవసరమైన సమన్వయం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
పై నుండి మారుమూల కుగ్రామం వరకు ఈ సమన్వయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.సీపీఐ మాజీఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో దేశానికి ప్రమాదకరం అందుకే టీఆర్ఎస్ తో కలసి పోరాటం చేయడానికి ముందుకొచ్చామన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు.కేంద్రంలో కొలువుదీరిన ఆ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు పేద ప్రజలకు భారంగా సంక్రమించాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాల్సిన అవసరాన్ని జాతీయ స్థాయిలో గుర్తించమన్నారు.అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడడంతో టీఆర్ఎస్ తో కలసి పని చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బీజేపీని అడ్డుకునే శక్తి టీఆర్ఎస్ కున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని పకడ్బందీగా రూపొందించినట్లు ప్రకటించారు.
సిపిఎం నేత,మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపిందని,దీనికున్న ప్రాధాన్యత దృష్ట్యా బీజేపీని ఓడించాల్సిన ఆవశ్యకత ప్రగతిశీల శక్తులపై పడిందన్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీని ఓడించగల శక్తి సామర్ధ్యాలు ఒక్క టీఆర్ఎస్ కే ఉన్నందున మునుగోడులో జరగనున్న ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ను బలపరచాలని సిపిఎం నిర్ణయించిందని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ దేశాన్ని అధోగతిపాలు చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు,సిపిఎం నల్లగొండ,భువనగిరి జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జహంగీర్,సిపిఐ నల్లగొండ,యాదాద్రి జిల్లా కార్యదర్శులు నెల్లికంటి సత్యం,గోదా శ్రీరాములు, టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఇంచార్జ్,ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy