ఈ సృష్టికి మూలం ఆదిపరాశక్తి అని చెబుతారు.అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఎన్నో రూపాలతో భక్తులను రక్షిస్తుంది.
మనదేశంతో పాటు చుట్టుప్రక్కల గల దేశాలతో కలిపి మొత్తం 51 శక్తి పీఠాలు ఉన్నాయి.ఒక్కో ఆలయంలో వెలసిన అమ్మవారికి ఒక్కో విశిష్టత కలిగి ఉంది.
ఈ క్రమంలోనే అమ్మవారిని పూజించే భక్తులు అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైన రోజులలో ఉపవాసం ఉండటం,దేవీ నవరాత్రుల ఉత్సవాలు సమయాలలో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తుంటారు.
సాధారణంగా అమ్మవారు కొన్ని ప్రాంతాలలో కొండపై వెలసి ఉంటారు.
ఇటువంటి కొండ ప్రాంతాలపై ఉన్న అమ్మవారిని దర్శించు కోవాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నది.మరి ఈ విధంగా కొండ శిఖరాలపై కొలువై ఉన్న అమ్మవారి ఆలయాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
వైష్ణో దేవి ఆలయం: వైష్ణో దేవి ఆలయం హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది.కొండ మీద ఉన్న గుహలో కొలువైన దైవం మాతా వైష్ణో దేవి.

తారా దేవి ఆలయం: తార పర్వతం పై ఉన్న ఈ ఆలయం లో అమ్మవారు అపరకాళికలా గంభీరంగా ఉన్నా ఎంతో ప్రశాంత చిత్తంతో ఉంటారు.
మానస దేవి ఆలయం: శివాలిక్ పర్వత శ్రేణిలోని బిల్వ పర్వతం శిఖరం పై మానసా దేవి కొలువై ఉన్నారు.
తారా తరిని ఆలయం:రిశికుల్య నది ఒడ్డున కుమారి హిల్స్ పై తారా తరిని ఆలయం ఉన్నది.ఎంతో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో మాత తారా, మాత తరిని అనే ఇద్ధరు దేవతలు ఉంటారు.
వీరిని ఆదిశక్తి అవతారాలుగా కొలుస్తారు.

ఆధర్ దేవి ఆలయం: రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంట్ అబూలోని ఒక ఎత్తైన శిఖరం పై ఉన్న గుహలో ఆధర్ దేవి ఆలయం ఉంది.ఈ గుహనే అర్బుడా దేవి గుహ అని కూడా పిలుస్తారు.
చాముండేశ్వరి ఆలయం: మైసూర్ పట్టణంలో చాముండీ పర్వతంపై చాముండేశ్వరి ఆలయం ఉంది.కాళిక, దుర్గ, చాముండీ మాతల కలయికగా భక్తులకు దర్శనమిస్తారు.
కనకదుర్గ ఆలయం: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఇంద్రఖీలాద్రి కొండపై ఈ కనక దుర్గ ఆలయం ఉంది.ఈ ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్ధినిగా ప్రసిద్ధి చెందారు.మహిషాసుర అనే రాక్షసుని సంహరించుటడం వల్ల అమ్మవారికి ఈ పేరు వచ్చింది.
ఈ విధంగా కొండలపై వెలసిన ఈ అమ్మవారి ఆలయాలను దర్శించడం కోసం ప్రతి ఏటా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.