ఉచిత ఇసుకను పంపిణీ చెయ్యాలి: భవన నిర్మాణ కార్మిక సంఘం

సూర్యాపేట జిల్లా:పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలోను ఇసుకను ఉచితంగా ఇవ్వాలని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ (Yalka Somaiya Goud)ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

టౌన్ అధ్యక్షులు శీలం వేణు ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సోమయ్య గౌడ్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక అందడం లేదని ప్రభుత్వం తీసుకొచ్చిన విధివిధానాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు.

ఇసుక రేట్లకు రెక్కలు రావడంతో ఎక్కడి కక్కడ నిర్మాణాలు ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తద్వారా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో ఆందోళన ఏర్పడుతుందని సొంత ఇండ్లు లేక కిరాయిలు చెల్లించలేక పస్తులు ఉంటున్న కుటుంబాలు ఉన్నాయన్నారు.తక్షణమే ఏపీ ఇసుక విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉపతల వెంకన్న,మండల ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా, టౌన్ కోశాధికారి కంచుపాటి రాంబాబు, రామకృష్ణ.నాగేశ్వరరావు, నరేష్,నకిరేకంటి అంజయ్య,వీరస్వామి, జాన్ సైదా,మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News