దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్లలో పనిచేసే ఉద్యోగి తన చేతివాటానికి పాల్పడినట్లు సోమవారం బయటపడింది.ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది భక్తులు తరలివచ్చారు.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కి సమీపంలోని పటాన్ చెరువు ప్రాంతం నుంచి 19 మంది అమ్మవారి దర్శనం కోసం వచ్చారు.అంతరాలయ దర్శనం చేసుకోవాలంటే 19 టికెట్లు తీసుకోవాలని మల్లికార్జున మహా మండపం కౌంటర్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ చెప్పాడు.
దర్శనానికి వచ్చిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు.దాంతో ఆ భక్తులు హైదరాబాద్లోని కార్పొరేటర్ తో ఫోన్లో ఆ ఉద్యోగికి ఫోన్ చేయించగా 15 టికెట్లకు అంగీకరించాడు.ఆ టికెట్ల కోసం కౌంటర్ లోని ఉద్యోగికి రూ.7500 నగదు ఇవ్వగా ఆయన టికెట్లు ఇచ్చి పంపించారు.
ఆ టికెట్లు తీసుకొని లిఫ్ట్ మార్గంలో వచ్చి క్యూ లో దేవాలయంలోకి రాగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి వారిలో ఎనిమిది మందికి మాత్రమే అంతరాలయ దర్శనానికి అనుమతించారు.మిగతా వారికి రూ.100 క్యూ లైన్ లోకి వెళ్లాలని చెప్పడంతో ఆ భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.15 టికెట్లలో 8 మాత్రమే 500 రూపాయల టికెట్లు ఉన్నాయని ఈ వెల్లడించారు.అంతేకాకుండా మిగతా 7 టికెట్లు వంద రూపాయలవి ఉండడంతో దేవస్థానానికి రావాల్సిన ఆదాయంలో 2800 గండిపడిన విషయం వెలుగులోకి వచ్చింది.ఈవో భ్రమరాంబ సెలవులో ఉండడంతో దేవస్థానం అధికారులు ఆ భక్తుడి నుంచి ఫిర్యాదు తీసుకోవడంతో పాటు టికెట్ల పంచనామా చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఇంకా చెప్పాలంటే శుక్రవారం, ఆదివారంలో టికెట్లలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మన్యువల్ టికెట్ల స్థానంలో కంప్యూటర్ తో టికెట్లు ఇస్తున్న అవకతవకలు తప్పడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై అధికారులు స్పందించి కంప్యూటర్ ప్రింట్‌తో కూడా రూ.500, రూ.100 టికెట్ల మధ్య వ్యత్యాసం ఉండేలా చూడాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.