మనం చేసే ప్రతి రోజు కార్యకలాపాలలో మనకు తెలియకుండానే మనం ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాము.కానీ మన ప్రమేయం లేకుండా మనకు తెలియకుండా జరిగిన పాపాల కన్నా, మన ప్రమేయం ఉండి ఇతరులు చెడు కోరుతూ చేసేటటువంటి పాపాలకు కచ్చితంగా ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది.
ఈ భూలోకం పై చేసిన పాపాలను యమలోకంలో యమధర్మరాజు లెక్క కడుతూ ఉంటాడని చెబుతుంటారు.మనం మరణించిన తరువాత మన పాపాలను బట్టి యమలోకంలో శిక్షలు కూడా అమలు చేస్తారని మనం వినే ఉంటాం.
అయితే పాపాలలో కూడా రకాలు ఉంటాయి అని ఎప్పుడైనా విన్నారా? అయితే ఆ పాపాలలో ఉన్న రకాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
పాపాలలో మానసికం, వాచికం, కాయికం– అని మూడు రకాల పాపాలుంటాయని పెద్దలు చెబుతుంటారు.
మానసిక పాపాలు అంటే బయటకు మంచిగా నటిస్తూ మనసులో ఇతర చెడ్డ ఆలోచనలను కలిగి ఉండి ఇతరులకు చెడు జరగాలని కోరుకోవటం, ఇతరుల ప్రవర్తన గురించి లేనిపోని నిందలు వేయటం, పరాయి స్త్రీల గురించి చెడుగా ఆలోచించడం వన్ని కూడా మానసిక పాపాలు అంటారు.
వాచిక పాపాలు అంటే మనసులోకి వచ్చిన ఊహలన్నీ పైకి మాట్లాడుతూ, పెద్దలను ఎదిరించి మాట్లాడటం మన కన్నా గొప్ప వారిని హేళన చేస్తూ మాట్లాడటం, ఎదుటి వారిపై లేనిపోని నిందలు వేస్తూ కఠినంగా ప్రవర్తించడం, దారినపోయే స్త్రీల గురించి అవమానకరంగా మాట్లాడటం వంటి వాటిని వాచిక పాపాలు అంటారు.
కాయిక పాపాలు అంటే శరీరంతో చేసే పాపాలు.నోరు లేని మూగ జీవులను హింసించడం, పక్షులను కొట్టడం, పరాయి స్త్రీల జోలికి వెళ్ళడం వంటి వాటిని కాయిక పాపాలు అంటారు.
మనం ఎటువంటి తప్పులు తెలిసి చేసినా తెలియక చేసినా దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే.కనుక వీటి బారిన పడకుండా త్రికరణశుద్ధిగా ఉండటం అలవాటు చేసుకోవాలి.