మనం గుడికి వెళ్లేటప్పుడు కచ్చితంగా కొబ్బరికాయ తీసుకెళ్తాం.ఏ ఆలయంలో చూసినా భక్తులు తమ కోర్కెలు తీర్చమని భగవంతుని ప్రార్థిస్తూ టెంకాయలను కొడుతుంటారు.
కానీ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దత్త క్షేత్రంలో మాత్రం టెంకాయలను కొట్టరు.చెట్టుకు తాడుతో కడతారు.
ఇది ఆచారంగా వస్తోంది.భక్తులు తాము తలచిన కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ ఒక టెంకాయను తాడుతో దత్త క్షేత్రంలో ఉన్న ఔదుంబర వృక్షం (మేడిచెట్టు)కు వేలాడదీయడం ఆచారంగా కొనసాగుతోంది.
సంతానం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారాల్లో లాభాలు తదితర కోర్కెలను తలచుకుంటూ భక్తులు టెంకాయని మేడిచెట్టుకు కట్టి దత్తాత్రేయునికి దండం పెట్టుకుంటారు.కోర్కెలు తీరితే ఆలయంలో పల్లకి సేవ, అభిషేకం, అన్నదానం, పారాయణం వంటి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామంటూ మొక్కుకుంటారు.
తమ కోర్కెలు నెరవేరిన వెంటనే తిరిగి ఆలయానికి చేరుకుని మొక్కుబడులను తీర్చుకుంటారు.దాంతో ఈ మేడిచెట్టు ఎప్పుడు చూసినా కొబ్బరికాయలతో నిండి ఉంటుంది.చెట్టు నిండిపోతే ఆ కొబ్బరికాయలను తొలగించి వాటిని పవిత్రమైన గోదావరి కాలువలో నిమజ్ఞనం చేస్తుంటారు.
పాదగయ క్షేత్రంలోనూ…

పిఠాపురం పాదగయ శ్రీ కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానంలో వేంచేసియున్న దత్తాత్రేయుని ఆలయంలోనూ కొబ్బరి కాయలు కొట్టకుండా అక్కడ ఉండే మేడిచెట్టుకు కట్టడం ఆచారంగా వస్తోంది.భక్తులు తమ మనసులో కోర్కెలు కోరుకుని కొబ్బరి కాయను మేడి చెట్టుకు కడతారు.అందుకే పాదగయ క్షేత్రంలో వెలసియున్న దత్తాత్రేయుడి గుడి వద్ద ఉన్న మేడిచెట్టు కొబ్బరి కాయలతో నిండిపోయి మేడి చెట్టు కాస్తా కొబ్బరి చెట్టుగా కనిపిస్తోంది.
ఇది ప్రాచీన ఆచారం…
పూర్వం ఒక భక్తురాలు తన మనసులో కోరిక కోరుకుని కొబ్బరికాయ కొట్టడానికి వీలు లేక అక్కడే ఉన్న ఔదంబరి చెట్టు దగ్గర పెట్టి వెళ్లిపోయి ఆమె కోరిక నెరవేరాక మళ్లీ తిరిగి వచ్చి చూడగా కొబ్బరి కాయ అక్కడే ఉండడంతో స్వామివారు ఆ కొబ్బరికాయను చూసి తమ కోర్కెలు తీర్చారని ఆమె చెప్పిందని, ఆ తర్వాత మరల అలాగే చేసిందని, అప్పుడు కూడా ఆమె కోరిక తీరడంతో అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది.