బీఆర్ఎస్ పార్టీకి చల్లా శ్రీలతా రెడ్డి రాజీనామా

సూర్యాపేట జిల్లా: ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం అసన్నమైన వేళ సూర్యాపేట జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి కీలక నేతలు షాక్ ల మీద షాకిస్తున్నారు.

బుధవారం జిల్లాలోని నేరేడుచర్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు,మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలతా రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి,పట్టణ అధ్యక్షురాలి పదవికి, మున్సిపల్ వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ పదవికి ఏక కాలంలో రాజీనామా చేసి అందరికీ షాకిచ్చారు.

ఈమేరకు ఆమె రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ కు పంపించినట్లు తెలిపారు.మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా లేఖను మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు.

మొదటి నుంచి పార్టీలో యాక్టివ్ గా పని చేసిన శ్రీలతారెడ్డి పార్టీలో కీలక పదవులు ఆశించి భంగపడ్డారు.దీనికి తోడు హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో లోలోన రగిలిపోతూ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

సొంత పార్టీలో ఎదురైన అవమానాలు,ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడతో విసుగు చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దీనిపై ఆమెను వివరణ కోరే ప్రయత్నం చేయగా త్వరలోనే తన రాజీనామాకు గల కారణాలను,భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తానని తెలిపారు.

Advertisement

చల్లా శ్రీలతా రెడ్డి సోదరుడు పోరెడ్డి కిషోర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని, అందుకే బీఆర్ఎస్ పార్టీకి శ్రీలతా రెడ్డి రాజీనామా చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా ఆమె రాజినామా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు,ముఖ్యంగా నేరేడుచర్ల పట్టణంలో అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బనే చెప్పాలి.పట్టణంలో తన రాజకీయ చాణక్యంతో గులాబీ పార్టీకి జవసత్వాలు పోసిన ఆమె రాజీనామా ప్రస్తుతం హుజూర్ నగర్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Latest Suryapet News