యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు నియోజకవర్గాని( Alair Assembly constituency )కి ప్రధాన జలవనరుగా ఉన్న గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలేరు నియోజకవర్గానికి తీరని అన్యాయం చేశారని,అసలు గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణం ఉన్నట్టా లేనట్టా…? అని నియోజకవర్గ ప్రజలు అయోమయంలో ఉన్నారని తుర్కపల్లి మండల కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎరుకల వెంకటేష్ గౌడ్ అన్నారు.మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన కొండపోచమ్మ రిజర్వాయర్ ను సందర్శించిన అనంతరం మాట్లాడుతూ సహజ సిద్ధంగా ఉన్న గంధమల్లను రిజర్వాయర్ గా ఏర్పాటు చేసి,ఆలేరు నియోజకవర్గానికి సాగు, త్రాగునీరు అందిస్తామని గత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్( CM KCR ) సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ మండలంలోని ఎర్రవెల్లి గ్రామంలోని ఆయన ఫామ్ హౌస్ భూములకు సాగునీరు అందించే ప్రధాన ఉద్దేశంతో కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం చేశారని విమర్శించారు.
నియోజకవర్గ రైతాంగం అన్నమో…రామచంద్రా… అంటూ అరిగోస పడుతుంటే కేసీఆర్ తన స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తగదని మండిపడ్డారు.ఇప్పటికైనా ఆలేరు నియోజకవర్గానికి ప్రధాన జలవనరుగా ఉన్న గంధమల్లను రిజర్వాయర్ గా నిర్మాణం చేసేందుకు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత చొరవ తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
లేకుంటే రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.గందమల్ల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ( Congress party )మండల సేవాదళ్ అధ్యక్షుడు తలారి అశోక్, మండల కాంగ్రెస్ నాయకులు గడ్డమీది యాదగిరి,కోట సురేష్, భూక్యా రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.