యాదాద్రి భువనగిరి జిల్లా: తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో శనివారం రైతు ఉత్సవాల పేరుతో ప్రభుత్వ అధికారులు నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలను దర్జాగా వేదికపైకి పిలిచి కూర్చోబెట్టడంపై తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ తీవ్ర అభ్యంతం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసాలమర్రి గ్రామంలో రైతు ఉత్సవాల సభా వేదికపైన తుర్కపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డిని ఏ హోదాతో కూర్చోబెట్టారని ప్రశ్నించారు.దత్తాయపల్లి గ్రామ రైతు వేదికలో జరిగిన రైతు దినోత్సవంలో వేదికపై వెల్పుపల్లి సర్పంచ్ భర్త గుడిపాటి అమరసింహ్మారెడ్డి వేదికపై దర్జాగా కూర్చున్నారని,
కేవలం ప్రజా ప్రతినిధులు,అధికారులు ఆశీనులయ్యే వేదికలపైన మండలంలోని మిగతా గ్రామాల్లో కూడా అధికార పార్టీ నాయకులను వేదికలపైకి ఆహ్వానించి కూర్చోబెట్టినట్లు సమాచారం ఉందన్నారు.నిబంధనలకు నీళ్ళు వదిలి అధికార పార్టీ నేతలకు ఊడిగం చేస్తున్న సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు జరిగిన ఘటనలపై వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.