ఒకప్పుడు ఎంతో మెరుగ్గా రాణించిన యువ ఆటగాళ్లకు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.ముఖ్యంగా అండర్ 19 ప్రపంచకప్ సాధించిపెట్టిన ఆటగాళ్లలో చాలా మంది కనుమరుగయ్యారు.ఇలాంటి ప్రతిభా వంతులైన ఆటగాళ్లు విపరీతమైన పోటీ వల్ల టీమిండియా క్రికెట్ జట్టులలో స్థానం సంపాదించు కోలేక పోతున్నారు.అండర్-19 జట్లు ప్రపంచ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన చాలా మంది ప్లేయర్లు ఇప్పుడు ఎటూ కాని స్థితిలో మగ్గి పోతున్నారు.ఈ సమస్యను గుర్తించిన బీసీసీఐ 19 ఏళ్లు దాటిన అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్ల కోసం అండర్-19+ అనే ఓ సెక్షన్ లేదా జట్టు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.దీని ద్వారా జాతీయ క్రికెట్ అకాడమీ పర్యవేక్షణలో వీరిలో గేమ్ స్కిల్స్‌ను మెరుగు పరచాలని బీసీసీఐ యోచిస్తోంది.
ఇటీవల ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన వారిలో షేక్ రషీద్, రవి కుమార్, రాజ్ అంగద్ బవా, యష్ ధుల్ డైరెక్ట్ గా రంజీలో స్థానం సంపాదించుకునే అవకాశం ఉంది.కానీ మిగతా వారి పరిస్థితి ఏంటి? అని అడిగితే సమాధానం ఎవరికీ దొరకదు.పోనీ అండర్-19 విభాగంలో స్థానం దొరుకుతుందా? అని ప్రశ్నిస్తే ఇక్కడి విపరీతమైన పోటీని చూస్తే లేదనే సమాధానం వినిపిస్తుంది.ఇలాంటి పరిస్థితి భారత క్రికెట్ లో ఉండ కూడదని బీసీసీఐ “ఫైవ్ లెవెల్స్“లో జట్టులను ఏర్పాటు చేయాలని దృష్టి సారిస్తోంది.
ఒక బీసీసీఐ అధికారి ప్రకారం, టీమిండియా జట్టు కోసం టాలెంటెడ్ ప్లేయర్లను సిద్ధం చేసేందుకు ఎన్‌సీఏ మొదటగా అండర్-16, ఆపై అండర్-19, ఎమర్జింగ్ ( అండర్ 23), జట్టు ఎ లతోపాటు కొత్తగా అండర్-19+ ప్లస్ సెక్షన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.ఈ సెక్షన్ లో టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లను చేర్చుకోవచ్చు.వారిలో మరింత మెరుగ్గా ఆడే వారిని గుర్తించి వారి స్కిల్స్ కు పదును పెట్టి మెయిన్ టీంలో చేర్చాలని బీసీసీఐ, ఎన్‌సీఏ భావిస్తున్నాయి.ఈ మేరకు ఎన్‌సీఏ నాలుగు ఫస్ట్ క్లాస్ గ్రేడ్ మైదానాలతో వాడుకలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక్కడ అండర్-19 ప్లస్ జట్టు ఆటగాళ్లు తమలోతాము ఆడుకుంటూ కోచ్, ట్రైనర్ల సహాయంతో తమ ఆటను మెరుగుపరచుకోవచ్చు.ఇదిలా ఉండగా U-19 ప్లస్ జట్టు కోసం బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి, నేషనల్ లెవెల్ సెలెక్టర్లు, తదితరులు డిస్కస్ చేసేందుకు రెడీ అయ్యారని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.