‘ పవర్’ ఊరికే రాదు ! పవర్ రావాలంటే ఎన్నో ఎత్తులు వెయ్యాలయ్యాలి, ఎన్నో కుయుక్తులు పన్నాలి.డబ్బు మంచినీళ్లలా ఖర్చుపెట్టాలి.
ఎన్నో సమీకరణాలు మార్చాలి.ఇవన్నీ చేసినా లక్ అనేది కలిసిరావాలి.
అప్పుడు ‘పవర్’ చేతికి అందుతుంది.అప్పుడే ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా రాజకీయ నాయకుల చేతికి అధికారం చిక్కుతుంది.
ఇదంతా ఇప్పుడు చెప్పేది ఏపీ రాజకీయాలనుద్దేశించే.ఫలితాల కోసం ఇంకా పద్దెనిమిది రోజుల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది.
ఈ లోపున రాజకీయ పార్టీలు తాము చేయాల్సిన పని చేయడంలో నిమగ్నమయ్యాయి.ప్రస్తుతానికి ఏ పార్టీకి గెలుపు పై స్పష్టమైన ధీమా లేదు.
అందుకే అన్నిరకాల ఎత్తుగడలతో అధికారం దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇక రాజకీయ పార్టీల గెలుపోటములపై కోట్లాది రూపాయల పందేలు సాగుతున్నాయి.
మరో వైపు రకరకాల సర్వేలు బయటకి వచ్చి ఆ పార్టీకి అన్ని సీట్లు, ఈ పార్టీకి ఇన్ని సీట్లు అంటూ హడావుడి చేస్తున్నాయి.దీంతో స్పష్టమైన క్లారిటీ రాక అటు అభ్యర్థులు, ఇటు పార్టీలు తెగ హైరానా పడుతున్నాయి.
ప్రస్తుతం ఏపీలో జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులు 20 నుంచి 30 కోట్ల వరకు ఖర్చుపెట్టారు అనే సంగతి బహిరంగ రహస్యమే.ఇప్పుడు గెలిస్తే ఆ మొత్తానికి నాలుగైదు రెట్లు సంపాదించుకోవాలి అనే ధ్యాసే ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే మంచి ఆఫర్ వస్తే పార్టీ ఫిరాయించేవారికి కూడా కొదవలేదు.వీరిని కట్టడి చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండాలంటే సొమ్ములు గట్టిగా వెదజల్లాలి.అసలు ఎవరేం చేస్తున్నారో తెలుసుకోవడానికీ కాసులు కుమ్మరించాలి.
ప్రస్తుతం ఏపీలో హాట్ హాట్ గా ఉంది.వాతావరణమే కాదు, రాజకీయమూ భగ భగ మండిపోతోంది.

వైసీపీ, టీడీపీ, జనసేనలు తమదే అధికారం అని ఎంత ధీమాగా ఉన్నాయో అంతకంటే ఎక్కువ ధీమాలో తమ సర్వేనే పర్ఫెక్ట్ అంటూ అనేక సర్వే సంస్థలు చెబుతున్నాయి.విజయం ఎవరి పక్షాన ఉన్నదో స్పష్టంగా ఎవరికి తెలియడంలేదు.సొంత పార్టీ అభ్యర్థులను కాపాడుకోవడానికి ఈసారి శిబిర రాజకీయాలకూ తెర తీయబోతున్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే ప్రస్తుత రాజకీయాల్లో విలువలు వెతకలేము కాబట్టి ఎవరి మీదా ఎవరికీ నమ్మకం లేదు.
పనిలో పనిగా పక్క పార్టీ నుంచి తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా ? ఉంటే ఎంత రేటులో ఉన్నారు ? అంటూ ఆరా తీస్తున్నారు.ఏది ఏమైనా మే 23 వరకే కాదు ఆ తరువాత కూడా నాయకుల వలసలతో ఏపీ రాజకీయం సందడి సందడిగా ఉండబోతున్నట్టే కనిపిస్తోంది.