దీపంలో ఉన్న నూనె మనలో దాగున్న అనేక దుర్గుణాలకి సంకేతం అంటారు పెద్దలు.అందులోని వత్తి మనలోని అజ్ఞానానికి ప్రతీక.
ఎప్పుడైతే మనం భక్తి భావనతో మనలోని దీపాన్ని వెలిగిస్తామో.నెమ్మదిగా మనలోని అజ్ఞానం హరించుకుపోతుంది.
ఆ తర్వాత దుర్గుణాలన్నీ మాయమవుతాయి.అందుకే ప్రతీ ఒక్క హిందువు వారంలో రెండురోజులైనా దేవుడి దగ్గర దీపం పెట్టడం మనం చూస్తూనే ఉంటాం.
చాలా మందికి దీపారాధనకు ఏ నూనె వాడాలన్నది ఎదురయ్యే ప్రశ్న.అయితే మనం పూజించే దేవత, పొందాల్సిన ఫలాల పైన కూడా ఏ నూనె వాడాలన్న విషయం ఆధారపడి ఉంటుందంటారు విజ్ఞులు.
దీపారాధనకి ఆవు నెయ్యి ఉపయోగిస్తే.ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని ఓ నమ్మకం.
అంతే కాదు.ఆరోగ్యం, ప్రశాంతత, ఆనందం వెల్లివిరుస్తాయట.
నువ్వుల నూనెతో చేసే దీపారాధన వల్ల మనల్ని వేధించే సమస్యలు, చెడు ప్రభావాలు, మనకు ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి.అందుకే శని గ్రహ శాంతి కోసం ప్రయత్నించే వాళ్లు నువ్వుల నూనెని ఎక్కువగా ఉపయోగిస్తారు.
కీర్తి, ప్రతిష్టలు పొందాలనుకునే వాళ్లు ఇష్టదైవాన్ని ఆముదంతో ఆరాధిస్తే మంచిది.
ఇంటిలోని చెడు ప్రభావాలు తొలగించడానికి, గృహంలో శాంతిని నెలకొల్పడానికి.పంచదీప నూనెతో దీపారాధన చేయాలి.ఈ దీపారాధన మనలోని చెడు ఆలోచనల్ని దూరం చేయడమే కాదు.
అనారోగ్యం, పేదరికాలను కూడా దరి చేరనివ్వదని పెద్దలు చెబుతారు.ఈ నూనెను కొబ్బరి లేదా నువ్వుల నూనె, ఆముదం, వేప నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి కలగలిపి తయారు చేస్తారు.