ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించే తిరుమల వసతి ఉప విచారణ కార్యాలయాలను ఆధునీకరించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని ఇంజినీరింగ్ అధికారులను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆదేశించారు .
తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఈవో తొలి సీనియర్ అధికారుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల ఆరోగ్య విభాగంలో పని చేసే పారిశుద్ధ్య సిబ్బంది డ్యూటీ సమయాలు, ఏ విధంగా పారిశుద్ధ్యం నిర్వహిస్తున్నారు, వారి నిర్వహణ షెడ్డ్యూల్, మెరుగైన పారిశుధ్యం తదితర అంశాలకు సంబంధించి నిపుణులతో సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మాణానికి సంబంధించిన స్ట్రక్చరల్ డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు .
హనుమంతుని జన్మ స్థలంపై వివిధ అంశాలతో కూడిన గ్రంథాలను పలు భాషల్లో ముద్రించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారిని ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర వ్రత విధానం అనే గ్రంథం ఇటీవల పండితులు సిద్ధం చేశారని, ఆ గ్రంథం సారాంశాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ప్రచురణల విభాగం పుస్తకాలు ముద్రించాలని, ఎస్వీబిసిలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయాలని, టీటీడీ వెబ్ సైట్ లో పొందు పర్చాలన్నారు.తద్వారా లక్షలాది మంది భక్తులకు శ్రీ వేంకటేశ్వర వ్రత విధానంపై అవగాహన కలుగుతుందని ఆయన తెలిపారు.
టీటీడీలో ఉన్న వేలాది రికార్డులను డిజిటలైజేషన్ చేసి, భద్రపరచి భావితరాలకు అందించేందుకు ప్రిజర్వేషన్ టెక్నాలజీని ఉపయోగించాలన్నారు.సప్తగిరి మాసపత్రికలో ముద్రించే శీర్షికలు పిల్లలకు, యువతకు ఉపయోగపడే విధంగా చక్కటి సారాంశంతో రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా పంచగవ్య ఉత్పత్తులు, డ్రై ఫ్లవర్ టెక్నాలజితో తయారు చేసిన ఫోటో ఫ్రేమ్‌లు రోజు వారి తయారీ, విక్రయం, ఎంత నిల్వ ఉంది అనే అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఈవో అన్నారు.అదేవిధంగా తిరుమలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు , వివిధ విభాగాల పనితీరు, తదితర అంశాల పై సమీక్షించారు.
జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఎఫ్ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజి, సిఇ శ్రీ నాగేశ్వరరావు, సిఎవో శ్రీ శేష శైలేంద్ర, ఎస్వీబిసి సిఇవో శ్రీ సురేష్ కుమార్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
DEVOTIONAL