వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు ఆయా శాఖల అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని, సేవలు అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో చేపడుతున్న సహాయక చర్యలు, ముందస్తు ఏర్పాట్లపై ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ నుంచి రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీ, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు.

ముందుగా ఆయా జిల్లాల్లో నమోదైన వర్షపాతం, ప్రాజెక్టులు, చెరువులు నీటిమట్టంపై ఆరా తీశారు.ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ఎన్ని క్యూసెక్కులు అని అడిగి తెలుసుకున్నారు.

వర్షం, వరద ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.వర్షం నేపథ్యంలో అన్ని గ్రామాల్లో చాటింపు వేయించాలని, జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని, ప్రజలు బయటికి వెళ్లకూడదని సూచించారు.

వరదల కారణంగా రోడ్స్, వంతెనలపై నుంచి వెళ్లకుండా పోలీసులు భారీకేడ్లు ఏర్పాటు చేయాలని, గిరిజన ప్రాంతాల వాసులకు అన్ని సేవలు అందాలని, ఎవరైనా గర్భిణులు ఉంటే వైద్యం అందించాలని ఆదేశించారు.మహబూబాబాద్ జిల్లాలో రైల్వే పట్టాలు పాడైన చోట ప్రయాణికులకు భోజనాలు, వసతి కల్పించాలని పేర్కొన్నారు.

Advertisement

కలెక్టర్, సీపీ, ఎస్పీ, ఇతర అధికారులు వివిధ ప్రదేశాలకు వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు.అప్రమత్తంగా ఉంటూ సేవలు అందిస్తున్న అధికారులందరికి అభినందనలు తెలిపారు.

వర్షాన్ని అంచనా వేస్తూ విద్యాలయాలకు సెలవులు ప్రకటించాలని, స్థానిక బెటాలియన్, స్థానిక అధికారులు, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.మరో 48 గంటలు అప్రమత్తంగా ఉంటూ సేవలు అందించాలని సూచించారు.

కరెంటు కోతలు లేకుండా చూసుకోవాలని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలని, నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డిపీఓ వీర బుచ్చయ్య, ఏఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధికారులందరూ స్థానికంగా అందుబాటులో ఉండాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

Latest Rajanna Sircilla News