ఖలిస్తాన్ వేర్పాటువాది, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ( Gurpatwant Singh Pannu ) హత్యకు కుట్ర జరిగిందంటూ కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.దీనిని అమెరికా భగ్నం చేసినట్లుగా ఈ కథనం పేర్కొంది.
తాజాగా పన్నూ హత్యకు కుట్రలో నిఖిల్ గుప్తా( Nikhil Gupta ) అనే వ్యక్తి ప్రమేయం వుందంటూ అమెరికా అటార్నీ కార్యాలయం స్పష్టం చేసింది.సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని గళమెత్తుతోన్న భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడి హత్యకు కుట్ర జరిగిందని ఆరోపించింది.
ఈ మేరకు భారత్ నుంచి నిందితుడికి ఆదేశాలు అందాయని యూఎస్ న్యాయశాఖ పేర్కొంది.కానీ ఈ ప్రకటనలో మాత్రం పన్నూ పేరును నేరుగా ప్రస్తావించలేదు.నిఖిల్ గుప్తాను ఈ ఏడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేయగా.అతడిని తమకు అప్పగించాలంటూ అగ్రరాజ్యం ఆ దేశంపై ఒత్తిడి తెస్తోంది.
మరోవైపు నిఖిల్ అరెస్ట్, తదితర అంశాలపై భారత్( India ) స్పందించింది.నిఖిల్‌కు తమ దేశం నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని, అమెరికా( America ) వద్ద దీనిపై ఎలాంటి ఆధారాలు లేవని భారత ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి.
అలాగే నిఖిల్ గుప్తాకు న్యాయ సహాయం అందిస్తామని తెలిపాయి.ఒకవేళ ఈ కేసులో అతని ప్రమేయం ఉందని తేలితే నిఖిల్ గుప్తాకు గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం వుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.అయితే పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న అమెరికా ఆరోపణలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) స్పందించారు.ఈ ఘటన తాము చెబుతున్న అంశాలకు మరింత బలం చేకూరుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా.పంజాబ్ రాష్ట్రంలో వేర్పాటువాదంతో పాటు భారత్‌లో హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ప్రమేయం వున్నందుకు గాను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) ప్రకారం ఎస్ఎఫ్‌జేను జూలై 2019లో భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.వేర్పాటువాదాన్న ప్రోత్సహించినందుకు, పంజాబీ సిక్కు యువతను ఆయుధాలు పట్టాల్సిందిగా ప్రేరేపించినందుకు పన్నూను కూడా ఆ మరుసటి సంవత్సరం కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది.