తెలంగాణ ఆంధ్ర పేరుకు రెండు రాష్ట్రాలు అయినా, ఒక రాష్ట్రం తో మరొక రాష్ట్రం ఎప్పుడు పోల్చి చూసుకునే పరిస్థితే ఉంది.రాజకీయంగాను, అభివృద్ధి పరంగానూ, ప్రభుత్వ పథకాల విషయంలో కానీ, అన్నిటిలోనూ రెండు రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసాన్ని అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు పోల్చి చూసుకోవడం ఆనవాయితీగా మారిపోయింది.
తెలంగాణ ,ఆంధ్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం దక్కించుకుంది.
అప్పటి నుంచి కెసిఆర్ పాలన చంద్రబాబు పాలనపై పోల్చుతూ మీడియా ఇప్పటికీ అనేక కథనాలు ప్రచురితం అవుతూ వస్తున్నాయి.
ఇక ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి.
ఈ రెండు ప్రభుత్వాల మధ్య అదే స్థాయిలో పోలిక వస్తోంది.ఇవన్నీ పక్కన పెడితే, టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ వ్యవహారం, అలాగే టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ కు మధ్య వ్యత్యాసాలను ఎత్తి చూపిస్తూ, అనేక కథనాలు వెలువడుతున్నాయి.
గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ ఐటి , గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.సరిగ్గా అవే శాఖలను ఏపీ ప్రభుత్వంలో లోకేష్ నిర్వహించారు.
రేపో మాపో టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుంటారు.అలాగే తెలంగాణలో కేసీఆర్ సైతం సీఎం పదవికి దూరంగా ఉండాలని, కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలనే అభిప్రాయంలో ఉండడంతో, మరోసారి కేటీఆర్ లోకేష్ మధ్య వ్యత్యాసాలు హైలెట్ అవుతూ వస్తున్నాయి.
కేటీఆర్ విషయానికి వస్తే, తండ్రికి తగ్గ తనయుడిగా తనను తాను నిరూపించుకోవడానికి కేటీఆర్ ప్రయత్నిస్తూ వస్తున్నారు.పార్టీలోనూ, ప్రభుత్వంలోను కేటీఆర్ తనదైన ముద్ర వేసుకున్నారు.కేసీఆర్ ను మించిన స్థాయిలో కేటీఆర్ రాజకీయాలు చేస్తూ, పట్టు సాధించారు.ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ, మంత్రి గానూ సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ, పార్టీపై పూర్తిగా పట్టు సాధించారు.
ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అవ్వడం, ఎక్కువగా విశ్రాంతి తీసుకునేందుకు మొగ్గు చూపుతుండటంతో కేసీఆర్ ను మైమరిపించే విధంగా, కేటీఆర్ పరిపాలనా బాధ్యతలు పరోక్షంగా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు.
మంత్రులు, కీలక అధికారులతో నిత్యం ఉన్నతస్థాయి సమీక్ష చేపడుతూ, జిల్లా పర్యటనలు చేస్తూ, అభివృద్ధి సంక్షేమ పధకాలను ప్రకటిస్తూ, కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నారు.
మరి కొద్ది రోజుల్లోనే కేటీఆర్ సీఎం పీఠంపై కూర్చోవడం ఖాయం అనే ప్రచారం జరుగుతోంది.అసలు కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లోనూ, పార్టీ నాయకుల్లోనూ, వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఏపీలో లోకేష్ వ్యవహారశైలిపై, ఆయన రాజకీయ సమర్ధత పైన అనేక అనుమానాలు ఆ పార్టీ నాయకుల్లోనే ఉన్నాయి.
చంద్రబాబు ఎంతటి రాజకీయ చాణిక్యుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు ఎవరికీ అర్థం కావు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూశారు.
ఆ అనుభవంతోనే ఇప్పుడు అధికార పార్టీపై పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం చంద్రబాబు వయస్సు రీత్యా, కరోనా భయంతో హైదరాబాదులోని ఇంటికే పరిమితం అయ్యారు.ఈ సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వంపై పోరాటం చేస్తూ, టిడిపి ప్రతిష్టను మరింత పెంచే విధంగా వ్యవహరించాల్సిన లోకేష్ చంద్రబాబు మాదిరిగానే ప్రస్తుతం ఇంటికే పరిమితం అయిపోయారు.
కేవలం సోషల్ మీడియా ద్వారానే స్పందిస్తూ, ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు.
అసలు లోకేష్ నాయకత్వంపై టిడిపి నాయకులు ఎవరిలోనూ నమ్మకం లేదు. పార్టీ సీనియర్ నాయకులకు కానీ, ప్రజల్లో గాని, లోకేష్ నాయకత్వంపై ఎవరికి నమ్మకం లేకపోవడం, అసలు ఆయనకు టిడిపి పగ్గాలు అప్పగిస్తే పార్టీ నాశనమైపోతుంది అనే అభిప్రాయం, ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో అయినా సీఎం కుర్చీలో కూర్చునే అర్హత, ఆ స్థాయి లోకేష్ కు లేవనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి.తడబడకుండా కనీసం ప్రసంగాలు చేయలేరని, పార్టీపైన పట్టు సాధించలేకపోతున్నారు అని, తండ్రి చాటు బిడ్డగానే లోకేష్ ఇప్పటికీ వ్యవహరిస్తూ వస్తున్నారనే అభిప్రాయాలు అందరిలోనూ ఉన్నాయి.
2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి చెందడంతో, లోకేష్ కు ప్రజా క్షేత్రంలోనూ బలం లేదని, ఆయనను నమ్ముకుని వెళ్తే, రాజకీయ భవిష్యత్తు ఉండదనే అభిప్రాయం పార్టీ నేతల్లోనూ కనిపిస్తోంది.కేటీఆర్ లోకేష్ ఇద్దరూ రాజకీయ వారసులుగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా, కేటీఆర్ తన సామర్ధ్యం ఏంటో నిరూపించుకుని, తండ్రిని మించిన కొడుకుగా గుర్తింపు పొందగా, లోకేష్ ఇప్పటికీ తండ్రి చాటు బిడ్డగానే గుర్తింపు పొందారు అనేది అందరూ ఒప్పుకునే నిజం.లోకేష్ కేటీఆర్ ను ఇప్పటికైనా ఆదర్శంగా తీసుకుంటే రాజకీయంగా పై మెట్టు ఎక్కేందుకు అవకాశం ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట.