తహశీల్దార్ ఆఫీస్ కి తాళం

సూర్యాపేట జిల్లా:బంగారు తెలంగాణలో ప్రజల బ్రతుకులే కాదు,ప్రభుత్వ అధికారుల బ్రతుకులు కూడా బజారున పడుతున్నాయంటే అతిశయోక్తి కాదేమో!రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యాలయ అధికారి కూడా స్వతంత్రంగా పని చేసే పరిస్థితి లేదంటే ఆశ్చర్యం కలగమానదు.

నిజమే బంగారు తెలంగాణా మొత్తం బాకీల తెలంగాణగా మారిందని అనడానికి నిలువెత్తు నిదర్శనమే చింతలపాలెం మండల తహశీల్దార్ కార్యాలయానికి జరిగిన అవమానం అని చెప్పకతప్పదు.

ఇంతకీ ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నారా?సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన తహశీల్దార్ కార్యాలయం కొరకు అద్దె భవనం తీసుకొని రెవిన్యూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.ఇంత వరకు బాగానే ఉంది.

కానీ,ఆ అద్దె భవనానికి గత 11 నెలల నుండి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి ఓనర్ కి అధికారుల మీద నమ్మకం పోయింది.ఎన్నిసార్లు అద్దె కొరకు అడిగినా పెడచెవిన పెట్టడంతో చిర్రెత్తుకొచ్చిన భవన యజమాని సోమవారం తహశీల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన మండలంగా ఏర్పాటు చేసిన సమయంలో నెలకు 13 వేలు చొప్పున అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.మండలం ఏర్పాటు దగ్గరనుండి తనకు సరిగా అద్దె చెల్లించడంలేదని, గత సంవత్సరంలో ఆరు నెలలు,ఈ సంవత్సరంలో ఐదు నెలలకు సంబంధించి మొత్తం 11 నెలలు అద్దె చెల్లించలేదని వాపోయాడు.

Advertisement

పలుమార్లు అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదని,అందుకే కార్యాలయానికి తాళం వేశానని చెప్పారు.అద్దె కార్యాలయానికి తాళం పడడంతో బంగారు తెలంగాణ రెవిన్యూ సిబ్బంది మొత్తం విధులకు హాజరు కాకుండా బయటనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

*చింతలపాలెం తహశీల్దార్ వివరణ* తాను ఇటీవల కాలంలోనే బాధ్యతలు చేపట్టాను.గతంలోనే బిల్లులు పెండింగ్ ఉన్నాయి.ఈ విషయాన్ని ప్రస్తుతం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే ఆరు నెలల అద్దె చేస్తామని చెప్పడంతో యజమాని తాళం తీశారు.

అద్దె ఆలస్యం కావడానికి బడ్జెట్ లేకపోవడమే ప్రధాన కారణం.

Latest Suryapet News