ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమై నెలలు గడుస్తోంది.దీనిని అడ్డుకునేందుకు అంతర్జాతీయ సమాజం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.
కానీ దీనికి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడే సూచనలు కనిపించడం లేదు.ఇదే సమయంలో యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడుతోంది.
ఇప్పటికే చమురు ధరలు పెరగ్గా.ఆహార సంక్షోభం ముంచుకొస్తోంది.
యూరప్ సహా పలు ఆఫ్రికా దేశాలకు రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి గోధుమలు ఎగుమతి అవుతాయి.ప్రస్తుతం యుద్ధం కారణంగా ఈ వ్యవస్థ స్తంభించిపోయింది.
ఇదే కాదు కనిపించని దుష్ప్రభావాలు ఎన్నో.
ఇకపోతే భారత్ కూడా ఈ యుద్ధం కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది.
గుజరాత్ కేంద్రంగా నడుస్తోన్న వజ్రాల పరిశ్రమకు చెందిన లక్షలాది మంది కార్మికులపై ప్రతికూల ప్రభావం పడింది.సౌరాష్ట్ర ప్రాంతంలోని గ్రామాల్లోని అనేక యూనిట్లు రష్యా నుంచి చిన్న పరిమాణంలో వజ్రాలను ప్రాసెసింగ్, పాలిషింగ్ కోసం దిగుమతి చేసుకుంటాయి.
రాష్ట్రంలోని వజ్రాల పరిశ్రమలో దాదాపు 15 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని జెమ్స్ అండ్ జ్యూవెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రాంతీయ ఛైర్మన్ దినేశ్ నవాదియా తెలిపారు.

రష్యా నుంచి చిన్న పరిమాణంలో వచ్చే వజ్రాల కొరత కారణంగా గుజరాత్‌లోని వ్యాపారవేత్తలు ఆఫ్రికన్ , తదితర దేశాల నుంచి ముడిసరుకును కొనుగోలు చేయాల్సి వస్తోంది.ఇది వారి లాభాలపై ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు.దీని కారణంగా రాష్ట్రంలోని డైమండ్ యూనిట్లు తమ కార్మికులు , షాలిపర్‌ల పనిగంటలను తగ్గించాయి.
వజ్రాల ప్రాసెసింగ్ పరిశ్రమకు సూరత్ కేంద్రంగా వున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో రష్యా ఆధారిత కంపెనీల వస్తువులను తాము కొనుగోలు చేయబోమంటూ అమెరికా కంపెనీలు తమకు ఈమెయిల్స్ పంపాయని నవాదియా తెలిపారు.
ఈ నిర్ణయం గుజరాత్‌లోని వజ్రాల పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపింది.సౌరాష్ట్రలోని భావ్ నగర్, రాజ్‌కోట్, అమ్రేలి, జునాగఢ్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాలలో వజ్రాల వ్యాపారం విస్తరించి వుంది.
యుద్ధానికి ముందు గుజరాత్‌కు పాలిషింగ్ కోసం దిగుమతి చేసుకున్న మొత్తం వజ్రాలలో 30 శాతం రష్యన్ డైమండ్ మైనింగ్ కంపెనీ అల్రోసా నుంచి వచ్చింది.







