నాసిరకం డబుల్ బెడ్ రూం ఇళ్లలో నరకయాతన..!

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఈనెల 17న కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

కానీ,ఏండ్ల తరబడి నిర్మాణ పనులు చేపట్టి, నిర్మాణం పూర్తయి ఐదేళ్ళు కావడంతో పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తలుపులు, కిటికీలు చెదలు పట్టి ఊడిపోయే స్థితిలో ఉన్నాయని, నిర్మాణంలో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకకుండా రాతి కట్టడంతో కాకుండా బ్రిక్స్ తో పునాదులు నిర్మించడం వల్ల పెద్ద పెద్ద పగుళ్ళు వచ్చి, గోడలు నెర్రెలు బారి ఎప్పుడు కూలిపోతాయో తెలియని స్థితిలో ఉన్నాయని,కనీసం నేటి వరకు కనీస మౌలిక వసతులు కూడా లేవని లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.

మూడు రోజుల నుంచి వస్తున్న వర్షంతో ఇంటి పైకప్పు మీద ఉండే సిమెంట్ లేచిపోవడంతో ఇళ్ళలోకి వర్షపు నీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పేరుకే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నామని చెపుతున్నా ఇళ్ల పరిస్థితి మాత్రం నాసిరకంగా ఉన్నాయని లబోదిబోమంటున్నారు.

వర్షాకాలం వస్తే పిల్లలు బయట ఉండలేని పరిస్థితి ఏర్పడిందని,చిన్నపాటి వర్షానికే కురిస్తే పెద్ద వర్షాలు వస్తే మా పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రజా ధనాన్ని వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అందుకే నాసిరకం ఇళ్ళతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపట్టి, అక్రమార్కుల నుండి అవినీతి సొమ్మును కక్కించాలని కోరుతున్నారు.

Advertisement
ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

Latest Suryapet News