రెయిన్ సిమెంట్ కంపెనీ ముందు కాంటాక్ట్ కార్మికుల వంటా వార్పు

సూర్యాపేట జిల్లా:రెయిన్ సిమెంట్ యాజమాన్యం గత 30 ఏళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులతో వెట్టిచాకిరి చేయించుకుంటూ వారికి అందించాల్సిన గౌరవ వేతనాన్ని అందించకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్ అన్నారు.

సోమవారం మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలోని రెయిన్ సిమెంట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఎదుట కాంట్రాక్టు కార్మికులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి మద్దతు తెలిపి వారితో వంటా వార్పు కార్యక్రమంలో భాగంగా వారితో కలసి భోజనం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గత మూడు నెలలు కంపెనీ కాంటాక్ట్ ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తున్నా యాజమాన్యం ఏ మాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు.వారికి తోడుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టినా సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంతో ఫ్యాక్టరీ ముందే బైఠాయించి వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కాంటాక్ట్ ఉద్యోగులతో కలసి కంపెనీ గేటు ముందే కూర్చుని కార్మికులతో కలిసి భోజనం చేసి నిరసన తెలుపుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీసులను అడ్డుపెట్టుకొని అరెస్టు చేసి కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.అయినా భయపడే ప్రసక్తే లేదని,కంపెనీ కార్మికులకు న్యాయం జరిగేంతవరకు భారతీయ జనతా పార్టీ పక్షాన కార్మికులకు అండగా ఉంటూ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శులు తోట శేషు,గుండెబోయిన వీరబాబు,కీత శీను,కొట్టే శ్రీహరి,చిలకల యర్రారెడ్డి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంచు తూఫాన్

Latest Suryapet News