ఉత్తమ మున్సిపాలిటీలో పేరుకుపోయిన చెత్త

కనిపించని పట్టణ ప్రగతి-కంపుకొడుతున్న పరిసరాలు.ఇబ్బందులు పడతున్న స్కూల్ పిల్లలు,ప్రజలు.

సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో స్కూల్ పిల్లల ధర్నా.

సూర్యాపేట జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డులు అందుకున్న పేట మున్సిపాల్టీలో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నా పట్టించుకునే నాథుడు లేడని సీపీఐ (ఎంఎల్)ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ విమర్శించారు.శుక్రవారం పేట మున్సిపాలిటీలోని 31వార్డులో ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థులు,ఉపాధ్యాయులతో కలసి సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 30,33 వార్డులతో పాటు,సద్దల చెరువు ట్యాంక్ బండ్ బతుకమ్మలు ఆడే దగ్గరి నుండి హైవే వరకు ఉన్న మురికి కాలువ రెండు పక్కల చెత్త,చెదారం పేరుకుపోయి,మురికి నీటితో నిండి దుర్గంధం వెదజల్లుతూ అక్కడ నివసిస్తున్న ప్రజలు అక్కడే ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు,ఉపాధ్యాయులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత నెల రోజుల క్రితం ఇదే సమస్యను స్వయంగా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకవెళ్లగా కాలువలోని చెత్త తీసి పక్కన వేశారు తప్ప వాటిని మునిసిపల్ సిబ్బంది తీసుకవేళ్లలేదని తెలిపారు.గత 3 రోజులుగా కురిసిన వర్షాల వల్ల తిరిగి చెత్త మళ్ళీ కాలువలోకి చేరిందని,దీంతో అక్కడి ప్రజలు,స్కూల్ పిల్లలు, ఉపాధ్యాయులు దుర్గంధం భరించలేక నరకం అనుభవిస్తున్నారని వాపోయారు.

అంతే కాకుండా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుండి ఖాళీ స్థలాలు ఉండడంతో అందులో నీరు నిలువ ఉండి పందులు స్వైరవిహారం చేస్తున్నాయని తెలిపారు.ఈ విషయంపై గతంలో పలు దినపత్రికల్లో కథనాలు వచ్చినా మున్సిపాలిటీ వారికి చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు.

Advertisement

నెలలు గడుస్తున్నా నేటి వరకు ఆ సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.పట్టణంలో పట్టణ ప్రగతి పేరుతో సమస్యలన్నీ పరిష్కరించి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారే తప్ప,ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మున్సిపాలిటీ తయారైందన్నారు.

ముఖ్యంగా 30,33 వ వార్డుల్లో చెరువు కట్ట పక్కన ఉన్న ప్రజలు నిత్యం దుర్వాసనతో,దోమలతో సహవాసం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని,ఇది వర్షాకాలం సీజన్ కావడంతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నందున తక్షణమే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి స్పందించి మున్సిపల్ కమిషనర్,సిబ్బంది పట్టణ పారిశుద్ధ్యతపై యుద్ధ ప్రాతపదికన సమస్యల పరిష్కరించడానికి చర్యలు తీసుకొనేలా దృష్టి సారించాలని కోరారు.లేనియెడల సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా తరఫున మున్సిపాలిటీ ఆఫీసు ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రేణుక, పి.డి.ఎస్.యు అధ్యక్ష కార్యదర్శులు ఎర్రా అఖిల్, పొన్నూరు సింహాద్రి,జిల్లా నాయకులు దొంతమల్ల రామన్న,ఐఎఫ్టియు జిల్లా కన్వీనర్ రామోజీ, జహంగీర్,పద్మ,వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

చూపుడు వేలుకు చుక్క ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్య వేలుకు : కలెక్టర్
Advertisement

Latest Suryapet News