అవినీతి ఆధారాలు సోషల్ మీడియాలో

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో అవినీతికి ఆష్కారం ఉండొద్దని అత్యధిక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవిన్యూ శాఖలోని వీఆర్వో వ్యవస్థనే ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా రద్దు చేసిన సంగతి తెలిసిందే.వీఆర్వో వ్యవస్థను రద్దు చేయగానే రెవిన్యూ వ్యవస్థ పునీతమైందా? అవినీతి కంపుతో కుళ్ళి వాసన కొడుతున్న రెవిన్యూ శాఖ ముఖ్యమంత్రి నిర్ణయంతో సువాసనలు వెదజల్లుతున్నాయా? అంటే అబ్బే అదేమీ లేదని,తమకు బాగా అలవాటైన అవినీతి కంపులోనే ఉన్నామని చెప్పకనే చెబుతున్నారు సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గ పరిధిలో గల అనంతగిరి మండల తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది.

ఎవరెన్ని చెప్పినా అవినీతిలో తమకున్న ట్రేడ్ మార్క్ ను కోల్పోయే సమస్యే లేదని అప్పుడప్పుడు ఇలా రుజువు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే అనంతగిరి తహశీల్దార్ కార్యాలయంలో ఇసుక పర్మిషన్‌ల పేరుతో ఓ అధికారి అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుండో బలంగా వినిపిస్తున్నాయి.పాలేరు వాగు అనంతగిరి మండలం గుండా ప్రవహిస్తూ ఉండటంతో మండలంలో ఇసుక లభ్యతకు కొదవ లేకుండా పోయింది.

ఇదే అనంతగిరి రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారికి అదునుగా మారింది.ఇంకేముంది అవకాశం ఉన్నప్పుడే అందిపుచ్చుకోవాలని బాగా తెలిసిన సదరు సారువారు,తమ అక్రమ అవినీతి కార్యక్రమానికి పచ్చజెండా ఊపాడు.ఇసుకను ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇవ్వాల్సిన అధికారి,ప్రైవేటు పనులకు కూడా అనుమతులు ఇస్తూ ఒక్కో ట్రాక్టర్ ట్రిప్‌కు రూ.500, స్టాంపు వేస్తే రూ.100 బేరం మాట్లాడుకుని దందాను షురూ చేశారు.నేరుగా నగదు చెల్లింపులైతే అందరికీ తెలిసిపోతుందని అనుకున్నారేమో ఆన్ లైన్ లావాదేవీలకు తెరలేపారు.

అనంతగిరి మండలం పాలేరు వాగు నుండి ఇసుక కావాలా మీరు నేరుగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.గూగుల్ పే,ఫోన్ పే లోనే సదరు అధికారి పర్మిషన్లు ఇచ్చేస్తారు.

Advertisement

ఇంత పక్కాగా అవినీతికి స్కెచ్ వేసినా ఎలా లీక్ అయిందో?డబ్బుచ్చి అక్రమ అనుమతులు పొందిన వారి పనా? తెలియదు కానీ!సదరు రెవెన్యూ అధికారికి ఫోన్ ద్వారా డబ్బు పంపిచిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్‌గా మారడంతో అయ్యగారి అవినీతి బాగోతం వెలుగు చూసింది.మరి ఇంతలా ఇసుక రవాణాలో అవినీతి దందా జరుగుతుంటే ఉన్నతాధికారులకు తెలియదా? ఈ అవినీతి మరకలు ఇతర అధికారులకు అంటలేదా? ఒక్కరే ఇంత చేస్తుంటే మిగతా వారు చోద్యం చూస్తున్నారా? లేక అందరికీ తెలిసే జరుగుతుందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు మండల ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి!తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అంతం కోసం పంతం పట్టినట్లుగా ప్రజలకు షో చూపెడుతున్న ప్రభుత్వ పెద్దలకు వెలుగు చూస్తున్న అవినీతి అధికారుల చిట్టా కనిపించడం లేదా? లేక పచ్చకామెర్లు వచ్చిన వాడి కళ్ళకు లోకమంతా పచ్చగా కనిపించినట్లు పైత్యంతో ఉన్నారా అని అంటున్నారు ఈ సంగతి చూసిన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమాజిక కార్యకర్తలు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంచు తూఫాన్
Advertisement

Latest Suryapet News