మన సనాతన భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే.అయితే దేవుడి ఆలయాలతో పాటు దేవత ఆలయాలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది.
ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికీ గ్రామ దేవతలు కొలువై ఉండి విశేష పూజలు అందుకుంటున్నారు.ఈ విధంగా అమ్మవారి ఆలయాలలో ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినదే నిమిషాంబిక ఆలయం.
అయితే ఈ దేవి యొక్క ప్రత్యేకత ఏమిటి ?ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
కర్ణాటకలోని శ్రీరంగపట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో నున్న గంజాం గ్రామంలో ఈ ఆలయం ఉంది.
పురాణాల ప్రకారం ముక్తకుడు అనే రుషి కల్యాణార్థం ఒక యాగాన్ని తలపెట్టారు.ఆ యాగం జరిగితే రాక్షసులు అంతమవుతారు అని భావించి ఎలాగైనా యజ్ఞ భంగం చేయాలని రాక్షసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు.
ఈ విధంగా ముక్తక ఋషి ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ రాక్షసుల ఆగడాలను అంతమొందించలేకపోయాడు.ఆసమయంలో పార్వతీదేవి యజ్ఞకుండంలో నుంచి ఉద్భవించి రాక్షసులను సంహరించగా అప్పటినుంచి అక్కడ ఉన్న పార్వతీ దేవిని నిమిషా దేవిగా పిలుస్తారు.
ఒడయార్లనే రాజులు శ్రీరంగపట్నంను రాజధానిగా చేసుకొని పాలన సాగించగా 400 సంవత్సరాల క్రితం కృష్ణరాజ ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు,శ్రీ చక్రాన్ని కూడా పూజిస్తారు.ఈ ఆలయంలో అమ్మవారికి గాజులు, నిమ్మకాయలను సమర్పిస్తారు.ఈ విధంగా సమర్పించి ఏదైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నిమిషాల్లో తీరుతాయని అక్కడ భక్తులు విశ్వసిస్తుంటారు.అదేవిధంగా అమ్మవారికి సమర్పించిన నిమ్మకాయలను ఇంటిలో ఉంచుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని భావిస్తారు.ఈ ఆలయ దర్శనార్థం ఇతర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటారు.
LATEST NEWS - TELUGU