తెలంగాణ బిజెపి( Telangana bjp ) లో అసంతృప్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, ఈ తరహా పరిస్థితులు బిజెపిలో ఆందోళన కలిగిస్తున్నాయి.
మొన్నటి వరకు బీఆర్ఎస్( BRS ) కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బిజెపి బలంగా కనిపించినా, కాంగ్రెస్ హవా ప్రస్తుతం కనిపిస్తోంది.బిజెపి , బీఆర్ఎస్ లలోని అసంతృప్త నాయకులంతా కాంగ్రెస్ వైపే క్యూ కడుతూ ఉండడం , వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతుందనే విధంగా పరిస్థితులు ఏర్పడడం వంటివి కలకలం సృష్టిస్తుండగా, ఆ పార్టీలోని సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల కాలంలో పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, కొంతమంది నాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ అధిష్టానం ప్రోత్సహిస్తూ ఉండడం కీలక అంశాలను పక్కనపెట్టి రాజకీయం చేస్తూ ఉండడం వంటివన్నీ బిజెపి ( BJP )కీలక నేతలలో అసంతృప్తిని రాజేస్తున్నాయి.
ఈ మేరకు దాదాపు పదిమంది కీలక నాయకులు రహస్యంగా భేటీ అయి పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం , పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసి , పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిని పక్కన పెట్టడం వంటి విషయాల పైన వీరు చర్చించారట .ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్( Bandi Sanjay ) ను అకస్మాత్తుగా మార్చడం, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు వ్యవహారాన్ని బిజెపి అధిష్టానం పట్టించుకోకపోవడం, బీ ఆర్ ఎస్, బిజెపి ఒక్కటేనన్న చర్చ ప్రజల్లో జరుగుతుండడం వంటి అంశాలపై రహస్యంగా సమావేశమైన నేతలు చర్చించుకున్నారట.ఈ అసంతృప్తి నేతలలో చాలామంది ఇతర పార్టీ నుంచి వచ్చిన వారే.
కేసీఆర్ ను అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా బిజెపిలో చేరినా, ఇప్పుడు ఆ పరిస్థితి పార్టీలో లేకపోవడం , పరోక్షంగా బీఆర్ఎస్ కు బిజెపి సహకరిస్తోంది అనే సంకేతాలు వెలువడుతుండడం, , కెసిఆర్ ను ఓడించడమే లక్ష్యంగా బిజెపిలో చేరిన వారికి ఆ లక్ష్యం నెరవేరే పరిస్థితులు కనిపించకపోవడం తదితర అంశాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.దీనికి తగ్గట్లుగానే ఈనెల 17న కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ గ్రౌండ్ లో అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహించింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amith sha ) అదేరోజు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులతో భేటీ కావాల్సి ఉంది.
కానీ దానిని చివరి క్షణంలో రద్దు చేశారు.బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో సమావేశం అయ్యారు.
అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో అమిత్ షా చర్చించినా.ఈటెల రాజేందర్ ను సైతం ఆ సమావేశానికి పిలవడం, ఆయనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం పైన అసంతృప్తి నేతలు ఆగ్రహంగా ఉన్నారట.
రాజేందర్ కారణంగా బిజెపిలోకి పెద్దగా చేరికలు చోటు చేసుకోకపోయినా, అధిష్టానం ఆయనకు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తుందనే విషయం పైన సీనియర్లు అసంతృప్తితో ఉన్నారట.ప్రస్తుతం ఈ సీనియర్ నేతల రహస్య సమావేశాలు తెలంగాణ బిజెపిలో( Telangana bjp ) కలకలం సృష్టిస్తుండగా , ఈ వ్యవహారాలపై అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.