నాసిరకం విత్తనాల సాగుతో మిర్చి రైతులు అవేదన...!

సూర్యాపేట జిల్లా: ఓ ప్రముఖ కంపెనీ ఎస్ డబ్యు 450 పేరుతో మిరప విత్తనాలు డిస్ట్రిబ్యూటర్లు, నర్సరీల ద్వారా మిరప విత్తనాలను మార్కెట్లోకి తెచ్చింది.

కంపెనీ ప్రతినిధులు రైతుల వద్దకొచ్చి సాగుచేసిన 90 రోజులకు దిగుబడి వస్తుందని చెప్పడంతో, వారి మాటలు నమ్మి సూర్యాపేట జిల్లా చింతలపాలెం,మేళ్లచెరువు,మఠంపల్లి మండలాల్లోని అన్నదాతలు సుమారు 1500 ఎకరాల్లో మిరపసాగు చేశారు.

మిరపసాగు చేసి వందరోజులు గడుస్తున్నా దిగుబడి రాకపోవడంతో నిండా మునిగామని రైతులు లబోదిబోమంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.తాము సాగు చేసింది నాసిరకం విత్తనాలను భావించిన రైతులు కంపెనీ వారికి తెలపడంతో గత గురువారం చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామంలో గల ఓ నర్సరీ వద్దకు కంపెనీ ప్రతినిధులు పరిశీలన కోసం వచ్చి, అక్కడి మిర్చి పంటలను పరిశీలించారు.

ఈవిషయం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కంపెనీ ప్రతినిధులను అడ్డుకొని ఇప్పుడు మాపరిస్థితి ఏమిటని నిలదీసి,అర్థరాత్రి వరకు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ విత్తనం 120 రోజులకు కాపు వస్తుందని, కొన్నిచోట్ల దిగుబడి వచ్చిందని, ఇక్కడ మాత్రం ఎందుకు రావట్లేదో తమకు అర్దం కావడం లేదన్నారు.

లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు మొక్కలను డిఎన్ఎ పరీక్షల కోసం ల్యాబ్ కి పంపించామని,రైతుల పరిస్థితిని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అయినా రైతులు శాంతించకపోవడంతో విషయం తెలుసుకున్న కోదాడ డిఎస్పీ ప్రకాశ్ జాదవ్, ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని రైతులకు నచ్చజెప్పి, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడించిన అనంతరం ఆందోళన విరమించామని బాధిత రైతులు చెబుతున్నారు.

Advertisement

ఒక ఎకరం మిరప పంట సాగు చేయాలంటే సుమారు లక్ష నుంచి లక్ష యాభైవేల రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుందని,అటువంటి తరుణంలో మార్కెట్లోకి ఇటువంటి నాసిరకం విత్తనాలు తీసుకొచ్చి రైతులను మోసం చేస్తున్న కంపెనీలపై పీడియాక్ట్ కేసు పెట్టాలని,నాసిరకం మిరప విత్తనాలను సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆ వార్తలు చదివి కన్నీళ్లు పెట్టుకున్నాను.. తమన్నా సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

Latest Suryapet News