బీఆర్ఎస్ పార్టీకి చకిలం అనిల్ కుమార్ రాజీనామా...?

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మలి విడత తెలంగాణ ఉద్యమకారుడు చకిలం అనిల్‌కుమార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించిన అనిల్ కుమార్ ఆయనకు ఎమ్మెల్సీ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై పార్టీకి గుడ్ బై చెప్పారు.

పార్టీ ఆవిర్భావం నుండి జిల్లాలో,నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో,పార్టీ విస్తరణలో అనిల్ కుమార్ కీలక భూమిక పోషించారు.22 ఏళ్లుగా బీఆర్ఎస్‌లో పనిచేసిన అనిల్ కుమార్ ప్రతి ఎన్నికలలో కూడా నల్గొండ అసెంబ్లీ టికెట్‌ ఆశించి నిరాశ చెందారు.గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి నుండి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపించిన పక్షంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ కి పిలిపించుకొని హామీ ఇవ్వడంతో ఆయన ఆ ఎన్నికల్లో కంచర్ల గెలుపు కోసం పనిచేశారు.

అయినప్పటికీ ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన చేసిన నిరీక్షణ ఫలించకపోవడం,సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో సదస్సులు,తన తండ్రి దివంగత చకిలం శ్రీనివాసరావు పంతులు శత జయంతి సదస్సుల ద్వారా ఎమ్మెల్సీ పదవి సాధన దిశగా అనిల్ కుమార్ అధిష్టానంపై ఒత్తిడి పెంచారు.

Chakilam Anil Kumar Resigns From BRS Party , BRS Party, Chakilam Anil Kumar, TDP

పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మాత్రం మరోసారి కూడా ఎమ్మెల్సీ పదవుల ఎంపికలో అనిల్ కుమార్ పేరును పరిశీలనలోకి తీసుకోకపోవడంతో తనకు ఇక గులాబీ పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేదని భావించారు.బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన అనిల్ కుమార్ భవిష్యత్తులో ఏ పార్టీలో చేరనున్నారన్నది నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

అయితే తన తండ్రి కట్టర్ కాంగ్రెస్ వాదిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న వారు కావడంతో అయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.ఏది ఏమైనా చకిలం అనిల్ కుమార్ రాజీనామాతో ముఖ్యంగా నల్లగొండ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

Latest Suryapet News