రాబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నారు.తమ వారసులను రాజకీయాల్లోకి తెచ్చి రాబోయే ఎన్నికల్లో బరిలోకి దింపాలని అడుగులు వేస్తున్నారు.
నియోజక వర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో వారితో పాటు వారసుల్ని కూడా తీసుకెళ్ళి ప్రజల్లో వారిని పరిచయం చేస్తున్నారు.అలంపూర్ నియోజక వర్గానికి ప్రస్తుతం డాక్టర్ అబ్రహం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
సౌమ్యుడు, వివాదరహితుడుగా పేరున్న ఆ పెద్దాయన తన కుమారుడి భవిష్యత్ ను ద్రుష్టిలో పెట్టుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ అజయ్ ను బరిలో నిలిపేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే నియోజకవర్గంలో ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం.
అజయ్ బాధ్యత మీదే అంటూ తన హర్డ్ కోర్ అనుచర వర్గానికి చెప్పుకొస్తున్నారట అబ్రహం.ఇదిలా ఉంటే ఇటీవల గద్వాలకు వచ్చిన సీఎం కేసిఆర్ కు తన కుమారుడిని ప్రత్యేకంగా పరిచయం చేయడంతో పాటు, అజయ్ కు మీ ఆశీస్సులుండాలని కోరినట్లు సమాచారం.
మరో పక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను ఎమ్మెల్యే అబ్రహం కలిసిన క్రమంలో కుశల ప్రశ్నలతో పాటు, కుటుంబ నేపధ్యం, కుమారుడు అజయ్ వివరాలు అడిగి తెలుసుకొని అజయ్ కు ఆసక్తి ఉంటే నియోజకవర్గంపై పట్టు పెంచుకోనేలా కష్టపడమని చెప్పినట్లు జిల్లా రాజకీయాల్లో చర్చ సాగుతోంది.
ఇదిలా ఉంటే తన కుమారుడి రాజకీయ భవిష్యత్ ను ద్రుష్టిలో పెట్టుకోని ఎమ్మెల్యే అబ్రహం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ మండల కమిటీల్లోనూ తనకు అనుకూలమైన వారికే ప్రాధాన్యతనిచ్చి నియామకం చేపట్టారు.మరో పక్క ఆయా మండలాల్లో పార్టీ పరిస్థితి, భవిష్యత్ పై ఎప్పటికప్పుడూ ఇంటలిజెన్స్ నివేదికలు తెప్పించుకొని ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో అలంపూర్ నియోజకవర్గంలో వారసుడిని రంగంలోకి దింపి ఫెయిల్ అయిన వారి మాదిరిగా కాకుండా.ప్రతి అడుగు పకడ్బందిగా అజయ్ భవిష్యత్ కు బంగారు బాటు వేయాలనే సంకల్పంతో అబ్రహం ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో వర్గపోరు, బేదాభిప్రాయాలను పక్కనబెట్టి అందరిని కలుపుకొని ముందుకు పోతున్నారు తండ్రి కొడుకులు.
ఇక గత కొంత కాలంగా వయో భారంతో ఉన్న తన తండ్రి అబ్రహం కు కుమారుడు అజయ్ చేదోడు వాదోడుగా ఉంటున్నారు.
అజయ్ నియోజకవర్గంలో వరుస పర్యటనలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో ద్వితీయశ్రేణి నాయకత్వంతో పాటు, క్షేత్ర స్థాయి క్యాడర్, యువతతో నిత్యం టచ్ లో ఉంటున్నారట.యువజన, అభిమాన సంఘాల ఏర్పాటు, సేవా కార్యక్రమాలతో అజయ్ విస్త్రుతంగా పర్యటిస్తుండటంతో క్యాడర్ అంతా అజయ్ కి ట్యూన్ అవుతున్నట్లు కనిపిస్తోంది.
మరోపక్క అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో అబ్రహం పార్టిసిపేషన్ కూడా ఎక్కడా తగ్గడం లేదు.ఇక తాజాగా నియోజక వర్గంలో అట్టహాసంగా నిర్వహించిన అజయ్ జన్మదిన వేడుకలు, పలు సేవాకార్యక్రమాలు అజయ్ నెక్ట్స్ బరిలో నిలవడం ఖాయమనే సంకేతాలిచ్చినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు .