పక్కదారి పడుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ

సూర్యాపేట జిల్లా: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టి రేషన్ బియ్యం పథకం సూర్యాపేట జిల్లా మోతె మండలంలో అధికారుల నిర్లక్ష్యంతో పక్కదారి పడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మోతె మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజల అవసరాల నిమిత్తం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్లు వ్యాపారంగా మార్చుకొని, పేదలకు ఇచ్చే బియ్యాన్ని ఒక కిలో ఐదు రూపాయల చొప్పున వారే కొనుగోలు చేస్తూ బడా వ్యాపారులతో చేతులు కలిపి అక్రమ దందాకు తెరలేపారనే వాదన బలంగా వినిపిస్తుంది.

ప్రజలకు సమర్థవంతంగా అందించాల్సిన వారే రేషన్ బియ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, వినియోగదారుల వద్ద కొనుగోలు చేసి అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నా తనిఖీలు నిర్వహించి ప్రజలకు అందేలా చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రేషన్ డీలర్లు ఆడింది ఆట పాడింది పాటగా మారిందని వినియోగదారులు అంటున్నారు.బయటికి చెపితే తమకు బియ్యం రాకుండా చేస్తారేమో, ఏదైనా బెదిరింపులకు దిగుతారేమోనని వాపోతున్నారు.

ఒకటి రెండు కాదు.మండలంలో అనేక గ్రామాల్లో ఇదే దందా కొనసాగుతుందని,దాదపు అందరు డీలర్లు రేషన్ కోసం వచ్చే వారితో ఈసారి బియ్యం బాగోలేవు, తీసుకుపోయి మీరైనా అమ్ముకోవడమే కదా అదేదో మాకే అమ్మండని,కావాలంటే డబ్బులు తీసుకోండి లేదంటే మరోసారి సన్న బియ్యం వస్తాయి కదా అప్పుడు తీసుకోండి అంటూ ప్రజలను మోసం చేస్తూ డీలర్లే రేషన్ బియ్యం దందాకు పాల్పడుతున్నారు.

కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో ఇదంతా అధికారుల కనుసన్నుల్లోనే జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ పథకాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని,జిల్లా ఉన్నతాధికారులకు స్పందించి మోతె మండలంలో జరిగే అక్రమ రేషన్ బియ్యం దందాకు చెక్ పెట్టాలని కోరుతున్నారు.

Advertisement
ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

Latest Suryapet News