యువరాజు అంటే కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది.ఆయన ఈ నెల (మే) పదకొండు, పన్నెండు తేదీల్లో రాష్ర్టంలో పర్యటిస్తారు.
రాష్ర్టం విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత రాహుల్ ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి.అందుకే ఆయన పర్యటనకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రధానంగా కాంగ్రెసు గడ్డు పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో రాహుల్ పర్యటనతో పార్టీ పుంజుకుంటుందని నాయకులు భావిస్తున్నారు.వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణలో రాహుల్ పర్యటించి రైతు కుటుంబాలను పరామర్శించి ఓదారిస్తే అది తమకు ప్లస్ అవుతుందని అంటున్నారు.
ఆయన రాష్ర్టానికి రాగానే ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు.రైతు కుటుంబాలను కలుసుకుంటారు.
రైతుల ఆత్మహత్యలు సంభవించిన గ్రామాల్లో కనీసం ఐదూళ్లలో ఆయన పర్యటిస్తారు.రాహుల్ తన పర్యటనలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కూడా వెళతారని గతంలో వార్తలు వచ్చాయి.
అక్కడి విద్యార్థులు కూడా రాహుల్ రావాలని కోరుకుంటున్నారు.అయితే ఈ పర్యటన కేవలం రైతు కుటుంబాలను పరామర్శించడానికే పరిమితం అవుతుందని నాయకులు చెబుతున్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు పరామర్శించలేదనే విమర్శలు ఉన్నాయి.రాహుల్ పర్యటన తరువాత కేసీఆర్‌పై విమర్శలు మరింత ఎక్కువ అవుతాయి.
ఢిల్లీ నుంచి వచ్చి రాహుల్ పరామర్శించగా కేసీఆర్‌కు ఏమైందని దుయ్యబడతారు.మొత్తం మీద రాహుల్ పర్యటనతో కాంగ్రెసుకు ‘కిక్కు’ వస్తుంది.