ప్రధానంగా వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు పంజాబ్‌లో ఉన్న తమ ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ప్రవాసుల ఆస్తులను కొందరు అక్రమించుకోవడం, నకిలీ పత్రాలను సృష్టించి తమ సొంతం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.
న్యాయ వ్యవస్థలోని లోసుగులను అడ్డుపెట్టుకుని వీరు విచారణ ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తున్నారని పలువురు ఎన్ఆర్ఐలు వాపోతున్నారు.జస్వంత్ సింగ్ అనే ఈ ప్రవాస భారతీయుడిది అదే పరిస్ధితి.
తన జీవితకాలంలో ఎక్కువ రోజులు న్యూయార్క్‌లో గడిపిన ఆయనకు పంజాబ్‌లోని స్థానిక పోలీసులు, న్యాయవ్యవస్థ నుంచి సరైన సహకారం అందక ఇబ్బంది పడుతున్నారు.అమృత్‌సర్‌కు సమీపంలోని సంఘ్నా గ్రామంలో వున్న తన వ్యవసాయ భూమిని ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించేందుకు జస్వంత్ సింగ్ పడరాని పాట్లు పడుతున్నారు.
గత రెండు నెలలుగా ఆయన పంజాబ్‌తో పాటు అమెరికాలో తనకు పరిచయమున్న ప్రతి ఒక్కరిని సాయం కోసం అర్ధించారు.ఎట్టకేలకు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి జోక్యంతో ఆక్రమణదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంపై జస్వంత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ .తాను 35 సంవత్సరాలు అమెరికాలో నివసించిన తర్వాత పంజాబ్‌కు వచ్చానని చెప్పారు.కానీ ఇక్కడి పరిస్ధితులు తనను బాధపెట్టాయని.తన భూమిని తిరిగి పొందడమే ఇప్పుడు తన తక్షణ కర్తవ్యమని జస్వంత్ అన్నారు.చిన్న వయసులోనే భారత్‌ను విడిచి వెళ్లిపోయిన తనకు స్థానిక వ్యవస్థను ఎదుర్కోవడం, పనిచేయించుకోవడం తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.
ఇక్కడికీ వచ్చి రాగానే ఎన్ఆర్ఐల ఫిర్యాదులను స్వీకరించేందుకు, పరిష్కరించేందుకు ఏర్పాటైన ఎన్ఆర్ఐ సెల్ తన పనిని సక్రమంగా నిర్వర్తించకపోవడం జస్వంత్‌ను ఆశ్చర్యపరిచింది.
తన సమస్య గురించి ఫిర్యాదు చేయడానికి ఆయనకు ఏకంగా రెండున్నర నెలల సమయం పట్టిందంటే.ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.అదే అమెరికాలో అయితే కేవలం ఫోన్ చేస్తే చాలని జస్వంత్ పేర్కొన్నారు.
తన భూమి కబ్జా అయినట్లుగా ఏప్రిల్ 16న తెలిసిందని.
వాస్తవాలను ధృవీకరించుకున్న తర్వాత ఏప్రిల్ 17న ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశానని, దీనిపై ఏప్రిల్ 22న తనకు రసీదు అందిందని ఆయన తెలిపారు.న్యాయం జరుగుతుందని ఎదురుచూశానని.
కానీ ఫలితం లేకపోవడంతో తానే ఇక్కడికి రావాల్సి వచ్చిందని జస్వంత్ అన్నారు.తాను ఎన్ఆర్ఐని కావడం వల్ల , న్యాయ పోరాటం చేసేందుకు తరచుగా ఇక్కడకు రాలేనందునే తన భూమి కబ్జాకు లక్ష్యంగా మారిందని ఆయన తెలిపారు.
ఎన్ఆర్ఐల ఆస్తులను నేరస్తుల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలని జస్వంత్ సింగ్ డిమాండ్ చేశారు.