అమెరికా- కెనడా మధ్య రవాణా సేవలు అందించే ట్రక్కర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్న కెనడా ప్రభుత్వ నిర్ణయం అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే.ట్రూడో సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు రాజధాని ఒట్టావాను ముట్టడించారు.
దీంతో నగరానికి వచ్చే రహదారులన్నీ ట్రక్కులతో కిక్కిరిసిపోయాయి.ఉద్రిక్తతల నేపథ్యంలోనే భద్రతా సిబ్బంది ముందు జాగ్రత్తగా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలించాయి.
వందలాది ట్రక్కులు రాజధాని ఒట్టావాను చుట్టు ముట్టడంతో నగర మేయర్ అత్యవసర పరిస్థితిని విధించారు.
పరిస్ధితి రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు బలప్రయోగానికి సైతం సిద్ధమయ్యారు.
దీనిలో భాగంగా అమెరికా- కెనడాల మధ్య అత్యంత కీలకమైన అంబాసిడర్ బ్రిడ్జిని దిగ్బంధించిన నిరసన కారులను తొలగించేందుకు కెనడా పోలీసులు భారీగా మోహరించారు.అమెరికాలోని డెట్రాయిట్.
కెనడాలోని విండ్సర్‌లను కలిపే అంబాసిడర్ బ్రిడ్జ్‌కు శనివారం ఉదయం భారీగా చేరుకున్న పోలీసులు.నిరసనకారులను తొలగించారు.
ఈ విషయం తెలుసుకున్న వందలాది మంది ప్రజలు అక్కడికి చేరుకోవడంతో పోలీసుల ఆపరేషన్ నిలిచి పోయినట్లుగా తెలుస్తోంది.అయితే మరింత మంది అక్కడికి చేరుకోకుండా బారీకేడ్లను అడ్డుగా పెట్టారు పోలీసులు.
ఈ నేపథ్యంలో ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన నిర్ణయం తీసుకున్నారు.దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు సోమవారం కీలక ప్రకటన చేశారు.
ట్రక్కు డ్రైవర్ల నిరసనల కారణంగా జనజీవనం స్తంభించిపోయిన క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకే ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ట్రూడో వెల్లడించారు.కెనడా ప్రజల భద్రతను, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
చట్టవిరుద్ధమైన, ప్రమాదకర కార్యకలాపాలను ఎట్టిపరిస్ధితుల్లోనూ అనుమతించబోమని ప్రధాని హెచ్చరించారు.నిరసనలను వెంటనే ఆపేయాలని, ట్రక్కు డ్రైవర్లంతా తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని ట్రూడో హితవు పలికారు.ఈ క్రమంలోనే ప్రధాని మద్ధతుదారుల్లో కొందరు కూడా రోడ్లపైకొచ్చి ‘గో హోమ్’ ప్లకార్డులు ప్రదర్శించారు.అయితే కెనడాలో ఎమర్జెన్సీ విధించడం గడిచిన 50 ఏళ్లలో ఇదే తొలిసారి.
అయితే దేశ భద్రతను దృష్టిలో వుంచుకుని ఫెడరల్ ప్రభుత్వానికి అదనపు అధికారాలను ఇవ్వడానికి కెనడియన్ చరిత్రలో మొదటిసారిగా అత్యవసర పరిస్థితుల చట్టాన్ని అమలు చేశారు.