మన పురాణాల ప్రకారం హిందువులు కలియుగ దైవంగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు.స్వామివారు తిరుమలలో ఏడుకొండలపై కొలువై ఉండటం వల్ల స్వామివారిని ఏడుకొండలవాడు అని కూడా పిలుస్తారు.
భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని స్వామివారి దర్శనార్థం రోజుకు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.శ్రీవారి దర్శనార్థం కొండపైకి చేరిన భక్తులకు అక్కడ నిత్యం గోవింద నామస్మరణలను వింటుంటే మనస్సు ఎంతో తేలికగా ఉంటుంది.
అయితే తిరుమలలో నిత్యం ఈ విధంగా గోవింద నామ స్మరణం చేయడానికి గల కారణం ఏమిటో.దాని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో చాలా మందికి తెలియదు.
అయితే ఇక్కడ గోవింద నామస్మరణలు ఎందుకు చేస్తారో తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం గోకులంలో ఉండే ప్రజలందరూ శ్రీకృష్ణుడిని కాకుండా ఇంద్రుడిని పూజించాలని భావిస్తారు.
ఈ క్రమంలోనే శ్రీకృష్ణుడు గోకులం చేరుకొని అక్కడి ప్రజలకు ఎవరు కూడా ఇంద్రుడిని పూజించకూడదు అని చెప్పడంతో ఆగ్రహించిన ఇంద్ర దేవుడు గోకులం పై పిడుగుల వర్షం కురిపిస్తాడు.దీంతో గోకులంలోని ప్రజలు ఎంతో భయాందోళనకు గురి కాగా అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన చిటికెన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి గోకులంలో ఉండే ప్రజలను ఆవులను రక్షించాడు.
ఈ విధంగా గోకులంలో ఉండే ప్రజలను శ్రీకృష్ణుడు రక్షించడంతో తన తప్పును తెలుసుకున్న ఇంద్ర దేవుడు కృష్ణుడి వద్దకు వచ్చి క్షమాపణ కోరుతున్న సమయంలో శ్రీ కృష్ణుడి దగ్గరికి ఒక కామధేనువు వచ్చి తన బిడ్డలైన గోవులను రక్షించినందుకు గాను కృతజ్ఞతతో శ్రీకృష్ణుడికి పాలతో అభిషేకం చేస్తుంది.ఈ దృశ్యాన్ని చూసిన ఇంద్ర దేవుడు పరవశించిపోయి శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెబుతాడు.నేను కేవలం దేవతలకు మాత్రమే అధిపతిని కానీ మీరు గోవులకు కూడా అధిపతి కనుక ఇప్పటి నుంచి మీరు గోవిందుడుగా కూడా ప్రసిద్ధి చెందుతారని ఇంద్ర దేవుడు శ్రీకృష్ణుడితో చెబుతాడు.ఆ విధంగా గో అంటే కేవలం గోవులు మాత్రమే కాకుండా ఎన్నో అర్థాలు వస్తాయి కనుక అప్పటి నుంచి శ్రీకృష్ణుడిని గోవిందునిగా పిలవబడతారు.
విష్ణుమూర్తి కృష్ణుడు, శ్రీ హరి అవతారం కనుక కలియుగంలో వెంకటేశ్వర స్వామిని గోవిందనామ స్మరణలతో పూజించడం, గోవిందుడిగా పూజించడం ఆనవాయితీగా వస్తుంది.