మన భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను పవిత్రమైనవిగా భావిస్తారు.అలాంటి వృక్షాలకు ప్రత్యేక పూజలు చేసి, దైవ సమానంగా భావిస్తారు.
ఇలాంటి వృక్షాలలో ఎంతో ముఖ్యమైనది మారేడు చెట్టు.హిందువులు మారేడు వృక్షాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.పూర్వకాలం నుంచి మారేడు చెట్టు ప్రాచుర్యంలో ఉంది.ఇకపోతే ఈ మారేడు చెట్టు అంటే ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరం.మారేడు ఆకులు మూడు ఆకులు కలిపి ఒకే ఈనెల ఉంటాయి.ఇవి ఆ పరమశివుడి మూడు కన్నులను సూచిస్తాయి.
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!! అని తలుస్తాము.శివుడికి ఎంతో ఇష్టమైన ఈ చెట్టు కిందనే నివాసం ఉంటాడని భావిస్తారు.
అదేవిధంగా ఈ మారేడు చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది.సాధారణంగానే వృక్షాలు పూలు పూసి కాయలు కాస్తే, మారేడు మాత్రం పువ్వు లేకుండా కాయలు కాస్తుంది.
సాధారణంగా మనం ఏదైనా పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేస్తాము.కానీ మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు కచ్చితంగా తొడిమలు ఉండాలి.
మారేడు దళానికి ఉన్న ఈనే శివలింగానికి తాకినప్పుడు మన ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.శివుడికి ఎంతో ఇష్టమైన ఈ మారేడు చెట్టు ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి.అయితే ఎలాంటి సందేహం లేకుండా మారేడు చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చు.అయితే మారేడు దళాలను కోసేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి.మారేడు చెట్టు ఆకులను బుధ, శనివారాలలో మాత్రమే కోయాలి.అమావాస్య, పౌర్ణమి, సోమవారం, మంగళవారం, సంక్రాంతి, శివరాత్రి వంటి పండుగల రోజు కూడా మారేడు దళాలను కోయకూడదు.
అందుకే ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరుచుకోవాలి.ఈరోజు అర్చన చేసిన మారేడు దళాలను మరుసటి రోజు వాటిని కడిగి స్వామివారికి అర్చన చేయవచ్చు.
ఎంతో పవిత్రమైన మారేడు చెట్టుకు ప్రదక్షణ చేస్తే మూడు కోట్ల దేవతలకు ప్రదక్షణ చేసిన పుణ్యం లభిస్తుంది
.