ప్రఖ్యాత న్యాయ కోవిదురాలు, అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్బర్గ్ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రిలో చేరారు.శుక్రవారం తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను మొదట వాషింగ్టన్‌లోని సిబ్లీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు.
అయితే మెరుగైన చికిత్స నిమిత్తం గిన్స్‌బర్గ్‌ను బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్కిన్స్ ఆసుపత్రిలో చేర్చినట్లు సుప్రీంకోర్టు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.వైద్యులు ఆమెకు ఇంట్రావీనస్ యాంటీ బయాటిక్స్ మరియు ఫ్లూయిడ్స్ ఇవ్వడంతో కోలుకున్నట్లుగా తెలుస్తోంది.దీంతో గిన్స్‌బర్గ్‌ను ఆదివారం మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
86 ఏళ్ల గిన్స్బర్గ్ ఉదరానికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడటంతో నవంబర్ 13న కోర్టు సమావేశాలకు హాజరవ్వలేదు.కానీ నవంబర్ 18న తిరిగి తన విధులకు హాజరయ్యారు.రెండు దశాబ్ధాల మధ్యకాలంలో గిన్స్బర్గ్ ఎన్నోసార్లు క్యాన్సర్ బారిన పడి దానిని ధైర్యంగా ఎదుర్కొన్నారు.1999లో తొలిసారిగా పెద్దప్రేగు క్యాన్సర్.2009లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, 2018లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నారు.తాజాగా ఈ ఏడాది ఆగస్టులో క్లోమ గ్రంథికి క్యాన్సర్ చికిత్సను తీసుకున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడిన రెండవ మహిళగా గిన్స్బర్గ్ రికార్డుల్లోకి ఎక్కారు.కోర్టు ఉదారవాద విభాగంలో ఆమె సేవలు అందిస్తున్నారు.తాను ఉద్యోగం చేయగలిగినంత కాలం బెంచ్ మీద ఉండాలని గిన్స్బర్గ్ కోరుకుంటున్నారు.
అయితే లిబరల్స్, కన్జర్వేటివ్స్ మాత్రం ఆమె ఆరోగ్యంపై ఒక కన్నేసి ఉంచుతున్నారు.