మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు మనుషుల్లో శక్తిని, పటుత్వాన్ని తగ్గిస్తున్నాయి.30 సంవత్సరాల వయస్సుకే చాలామంది కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్ వ్యాధులతో బాధ పడుతున్నారు.60 ఏళ్లు దాటాయంటే ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది.కాలుష్యం ఆహారపు అలవాట్ల వల్ల మనిషి ఆయుష్షు సైతం అంతకంతకూ తగ్గుతోంది.
అయితే ఒక వృద్ధుడు మాత్రం వందేళ్ల వయస్సులోను ఔరా అనిపించేలా సాహసం చేశాడు.
గిన్నీస్ రికార్డుపై దృష్టి పెట్టిన సదరు వృద్ధుడు ఏకంగా 27 నిమిషాల పాటు నీటి అడుగునే గడిపి సోషల్, వెబ్ మీడియాలో తన గురించే చర్చ జరిగేలా చేశాడు.
వందేళ్ల వయస్సు ఉన్నా యువకుడిలా సరస్సు అడుగున ఈదేశాడు.మనస్సులో చేయగలమనే సంకల్పం ఉంటే వయస్సు ఏ పనైనా చేయడానికి అడ్డు కాదని నిరూపించాడు.
లేటు వయస్సులో స్కూబా డైవింగ్ చేసి వయస్సు పెరుగుతున్నా తనలో శక్తి తగ్గలేదని తాత ప్రూవ్ చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే ఇండియానాలోని రాక్‌ఫార్డ్‌కు చెందిన బిల్ ల్యాంబెర్ట్ అనే వ్యక్తికి ఈ నెల 5వ తేదీతో నూరు పుట్టినరోజులు పూర్తై నూటా ఒకటవ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు.
అయితే వయస్సు మీద పడినా తనలో శక్తి ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకోవడానికి పుట్టినరోజు జరిగిన రెండవ రోజే సౌత్ బెలోయిట్‌లోని పిరల్ లేక్‌లో స్కూబా డైవింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.
తాత సన్నిహితులు లేటు వయస్సులో అంత సాహసానికి పూనుకోవద్దని వారించారు.
అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా తాత స్కూబా డైవింగ్ కు వెళ్లడంతో అతని సన్నిహితులు, బంధుమిత్రులు సైతం స్కూబా డైవింగ్ ను చూసేందుకు వెళ్లారు.సాధారణంగా 20 నిమిషాలు నీటి అడుగున ఉంటే గిన్నీస్ రికార్డ్ సొంతమయ్యే అవకాశాలు ఉంటాయి.
అయితే తాత అంతకంటే ఎక్కువ సమయమే నీటిలో ఉండటంతో గిన్నీస్ రికార్డ్ సొంతమవుతుందేమో చూడాలి.